యాదాద్రి భువనగిరి/ములుగు, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రెండేండ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి, సోనియాగాంధీతో ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర శివారులో భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటిపారుదల పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంతకుముందు అనాజిపురంలో బునాదిగాని కాల్వను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల పంపుహౌస్, మోటర్ల పనితీరును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క అధికారులతో కలిసి పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఆ శాఖ ఈఅండ్‌సీ, సీఈలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వ హయంలో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పనులు పదేళ్లుగా కుంటుపడ్డాయన్నారు. శం కుస్థాపనను 2008లో సోనియాగాంధీ చేశారని, పనులను 2026 మార్చి వరకు పూర్తి చేసి తిరిగి సోనియా గాంధీ ప్రారంభిస్తారనిమని చెప్పారు. 300 రోజుల పాటు నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోతల ద్వారా 60 టీఎంసీ గోదావరి జలాలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా సా గునీటితో పాటు తాగునీటిగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. మోడికుంట, సమ్మక్క బరాజ్‌కు అనుమతులను సాధిస్తామని, 1.4 టీఎంసీలతో గంధమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ‘కాళేశ్వరంపై కొం త అయోమయం ఉంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంది. నేషనల్ డ్యామ్ అథారిటీతో పలుమార్లు టెస్టింగ్ చేయించాం. బ్యారేజీ, డిజైన్, నిర్మాణం, మెయింటెనెన్స్‌లో తీవ్ర లోపాలు ఉన్నాయని తేల్చారు. మూడు కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది’ అని ఉత్తమ్ చెప్పారు.
ఇంకా 13వేల కోట్ల రుణమాఫీ: పొంగులేటి
31వేల కోట్ల రుణమాఫీలో ఇప్పటివరకు రూ. 18 వేల కోట్లు మాఫీ చేశామని, మిగతా రూ.13 వేల కోట్లు త్వరగా మాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 40 రోజుల్లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు ముగ్గుపోసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టనున్నట్లు చెప్పారు. ధరణి ప్రక్షాళన చేస్తామని, ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే రోల్ మోడల్‌గా చేస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
భూ నిర్వాసితులకు నష్టపరిహారం: సీతక్క
రామప్ప నుంచి లక్నవరానికి గ్రావిటీ కెనాల్లో భూములు కోల్పొయే నిర్వాసితులకు తగిన విధంగా నష్టపరిహారం అందిస్తామని మంత్రి సీతక్క అన్నారు. సమావేశాల్లో ప్రభుత్వ విప్ ఐలయ్య, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌రెడ్డి, పల్లా రాజశేఖర్‌రెడ్డి, సామేల్, వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, మురళీనాయక్ పాల్గొన్నారు.
దేవాదులకు రూ.200 కోట్లు కేటాయించండి : ఎమ్మెల్యే పల్లా
జనగామ, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): ‘రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.200 కోట్లు కేటాయించండి.. జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. శుక్రవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్‌స్థాయి నీటి పారుదల శాఖ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు 4 మోటర్లు ఆన్‌చేసి చెరువులు నింపాలని ఈ సందర్భంగా కోరారు.