ఒకడు రూ.28 వేల కోట్లు మోసం చేస్తడు. మరొకడు 18 వేల కోట్లు వసూలు చేస్తడు. వాళ్లను మాత్రం కేంద్రం ఏమనది. వాళ్లు నిక్షేపంగా ఉంటరు. అదానీ గ్రూప్‌కు ఈ మధ్యే రూ.12వేల కోట్లు మాఫీ చేసిన్రు. అది శాతనైతది కానీ.. 60 లక్షల మంది రైతులకు సంబంధించి.. ఒక రాష్ర్టానికి సంబంధించి రూ.మూడున్నర వేల కోట్లు పెట్టుమంటే శాతగాదా?
దేశంలో కనీస మద్దతు ధరకు రాజ్యాంగపరమైన రక్షణ ఇస్తూ, రైతుల కోసం సమీకృత నూతన వ్యవసాయ విధానం రావాల్సి ఉన్నది. హైదరాబాద్ వేదికగా కార్యాచరణ ప్రారంభిస్తాం. త్వరలో అన్ని రాష్ర్టాల రైతు ప్రతినిధులు, ఢిల్లీలో ఉద్యమంచేసిన రైతు సంఘాలను, ఎకనమిస్టులను పిలిపిస్తా. వర్క్‌షాప్ పెట్టి పాలసీ డిక్లేర్ చేస్తాం. కేంద్రం ఖర్మ బాగుంటే ఆ పాలసీని తీసుకుంటది. లేదంటే వాళ్లను భారత రైతాంగం గిల్లిపారేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకొంటది.
రాష్ట్రంలో నిర్ణయం తీసుకొంటే చాలా కఠినంగా డెలివర్ చేయగలిగే ప్రభుత్వం ఉన్నది కాబట్టి.. వచ్చే మూడు నాలుగు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించి మొత్తం కొంటామని చెప్పగలుగుతున్నాం. రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మవద్దు. ఒక రోజు ఎనుకనో ముందో.. ప్రతి గింజ ప్రభుత్వం కొంటది. మద్దతు ధర 1,960 ఠంచనుగా చెల్లిస్తాం.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కార్పొరేట్లకు, దొంగలకు పదిన్నర లక్షల కోట్లు మాఫీచేసిన కేంద్ర ప్రభుత్వం.. 60 లక్షల మంది రైతుల కోసం మూడున్నర వేల కోట్లు భరించలేకపోతున్నదని మండిపడ్డారు. పైగా రైతులను, ప్రభుత్వాన్ని, మంత్రులను ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం చెతులెత్తేసినా.. తెలంగాణ ప్రభుత్వం రైతులను విడిచిపెట్టదని, తప్పకుండా ఆదుకొంటుందని స్పష్టంచేశారు. రాష్ట్రం వచ్చినప్పటినుంచి వివిధ పథకాల ద్వారా రైతులను ఆదుకొన్నామని, గ్రామాల్లో అద్భుతమైన ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. దానిని చెడగొట్టేది లేదని చెప్పారు. పండిన ప్రతిగింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్న సీఎం.. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మూడునాలుగు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. దేశ రైతాంగానికి దిశానిర్దేశం చేసేలా హైదరాబాద్ వేదికగా ‘ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ’ని ఆవిష్కరిస్తామని చెప్పారు.
కేంద్రం ఇప్పటివరకు బ్యాంకులను మోసం చేసినవారికి సుమారు రూ.పదిన్నర లక్షల కోట్లు మాఫీ చేసిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. షావుకార్లకు, సేట్లకు, బడా కంపెనీలకు, బ్యాంకులను మోసం చేసేటోళ్లకు ఇచ్చేదానితో పోల్చితే తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొంటే పడే భారం చాలా తక్కువని చెప్పారు. ‘ఒకడు రూ.28 వేల కోట్లు మోసం చేస్తడు. మరొకడు రూ.18 వేల కోట్లు వసూలు చేస్తడు. వాళ్లను మాత్రం కేంద్రం ఏమనది. వాళ్లు నిక్షేపంగా ఉంటరు. అదానీ గ్రూప్‌కు ఈ మధ్యే రూ.12వేల కోట్లు మాఫీ చేసిన్రు. అది శాతనైతది కానీ.. 60 లక్షల మంది రైతులకు సంబంధించి.. ఒక రాష్ర్టానికి సంబంధించి మూడున్నర వేల కోట్లు పెట్టుమంటే శాతగాదా?’ అని నిలదీశారు. దానికే అరుపులు, పెడబొబ్బలు, కుట్రలు, అరాకిరి మాటలు, పనికిమాలిన, దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఒక కేంద్ర మంత్రి రీసైక్లింగ్ ఆరోపణలు చేస్తున్నారన్న సీఎం.. ‘ప్రభుత్వం ఎక్కడైనా రీసైక్లింగ్ చేస్తుందా? అది సాధ్యమైతదా? మాకేం పనిలేదా?’ అని ప్రశ్నించారు. రైతుల పట్ల, దేశ ప్రజల పట్ల కేంద్రం ఎంత నీచంగా, నికృష్టంగా, బాధ్యతారహితంగా ఉన్నదో చెప్పటానికి ఇదొక సంకేతమన్నారు. ఈ దుర్మార్గ విధానాలను దేశ ప్రజలకు చెప్పేందుకే తాము ఢిల్లీ వరకు పోరాటం చేశామని తెలిపారు.
కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదని, వీళ్ల వ్యవహారం సక్కగా లేదు కాబట్టి.. వరి వేయొద్దని ఇతర పంటలు వేయండని రైతులకు సూచించామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్కడి బీజేపీ నేతలు ‘మేం కొంటం, ఎంతనన్నా వేయండి’ అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారని చెప్పారు. దీంతో కొంతమంది ప్రత్యామ్నాయం లేక వరి వేశారన్నారు. మరికొందరు రైతులు అర్థం చేసుకున్నారని, గతంలో 55 లక్షల ఎకరాలు ఉంటే ఈసారి 36 లక్షల ఎకరాలకు తగ్గిందని చెప్పారు. ఇందులో 3 లక్షలు ఎకరాల్లో పంట విత్తనాలకు, 2 లక్షల ఎకరాల్లో పంట తినడానికి పోతుందని చెప్పారు. వచ్చే పంటను సేకరిస్తే కలిగే చిన్నపాటి నష్టాన్ని భరించలేమని, మా వల్ల కాదని కేంద్రం చేతులు ఎత్తేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తాము చివరిదాకా ప్రయత్నించామని తెలిపారు.
తాను ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘మీరు ఇయ్యనంత మాత్రాన మేము మా రైతులను గంగలో వదిలిపెట్టం. మీకు ఎట్లాగూ తెలివిలేదు. మా రైతులను మేము కాపాడుకుంటం. మాకు ఆ ధైర్యమున్నది. అవసరమైతే ఒక పూట ఉపాసం ఉండుకుంట, ఇంకోకాడ ఖర్చులు తగ్గించుకుంటం’ అని చెప్పానని సీఎం గుర్తుచేశారు. దాని ప్రకారమే క్యాబినెట్లో సమగ్రంగా చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో రైతులను ఆదుకొనేందుకు ఉచిత కరెంటు కోసం రూ.12 వేల కోట్లు, రైతుబంధు కింద రూ.15 వేల కోట్లు, రైతుబీమా కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఉచితంగా సాగునీరు అందిస్తుండటం ద్వారా మరికొంత నష్టం భరిస్తున్నామని వివరించారు. ఇన్ని రకాలుగా రైతుల కోసం ఖర్చు చేసి, తెలంగాణ గ్రామాల్లో ఆనందం తీసుకొచ్చామని తెలిపారు. రైతు బాగుంటేనే చేతి వృతులు, కులవృత్తులు బాగుంటాయని, గ్రామాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని భావించామని చెప్పారు. తాము చేసిన ప్రయత్నాన్ని చిల్లర మల్లర కేంద్రం తిరస్కరించినంత మాత్రాన వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుతో రాష్ట్రంపై పడే భారాన్ని లెక్కించేందుకు సీఎస్ నేతృత్వంలో ఆర్థిక, వ్యవసాయ, నీటి పారుదలశాఖల కార్యదర్శులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. తక్కువ నష్టంతో ధాన్యం కొనేలా కమిటీ సూచిస్తుందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు బుధవారం నుంచే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి, అధికారులతో చర్చలు జరిపి ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రులకు సూచించామని తెలిపారు. రాబోయే రెండుమూడు రోజుల్లో ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని, గోనెసంచులు వంటి సదుపాయాలను పౌరసరఫరాల చూసుకుంటుందని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో సమర్థమైన ప్రభుత్వం ఉన్నది.. నిర్ణయం తీసుకొంటే చాలా కఠినంగా డెలివర్ చేయగలిగే ప్రభుత్వం ఉన్నది కాబట్టి.. వచ్చే మూడునాలుగు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించి మొత్తం కొంటామని చెప్పగలుగుతున్నాం’ అని తెలిపారు. ‘రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మవద్దు. ఒక రోజు ఎనుకనో ముందో.. ప్రతి గింజ ప్రభుత్వం కొంటది. మద్దతు ధర రూ.1960 ఠంచనుగా చెల్లిస్తం. గతంలో బ్యాంకులో పడినట్టే.. ఇప్పుడు కూడా వస్తయి. ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండిచేయి చూపినంత మాత్రాన రైతులను చిన్నబుచ్చేది లేదు’ అని స్పష్టం చేశారు.
రైతులు ఎప్పుడు చూడని నీళ్లను, ఎన్నడూ లేనట్టుగా కరెంటు సరఫరాను చూస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పొలాలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇదివరకు లేని ఫీల్‌గుడ్ వాతావరణం ఉన్నదన్నారు. ఒకప్పుడు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోన అని పాడిన చోటే.. ఇప్పుడు పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరులోన అని పాడుకుంటున్నారని చెప్పారు. గోరటి వెంకన్న ఇటీవల పీరీల పండుగ రోజు ఊరికి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ‘గతంలో ఎడారిలాగా ఉండే గ్రామాలు ఇప్పుడు కోనసీమ మాదిరిగా కనిపిస్తున్నాయి’ అంటూ సంతోషంగా చెప్పారని తెలిపారు. అలాంటి అద్భుతమైన, ఉల్లాసభరిత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దని, వెలితి తేవొద్దనేదే తమ తాపత్రయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై మూడునాలుగు వేల కోట్లు భారం పడ్డా మంచిదే కానీ.. రైతాంగాన్ని చిన్నబుచ్చొద్దని క్యాబినెట్లో చర్చించామని తెలిపారు. ఈ మేరకు రైతుల కోసం మాత్రమే ధాన్యం కొనాలని నిర్ణయించినట్టు చెప్పారు.
దేశ రైతులు ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం లేక సతమతమవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వారికి దిక్కుదివాణం లేదని, వారిని కేంద్రం బికారుల లెక్క చూస్తున్నదని మండిపడ్డారు. ‘ఏం చేస్తరని అనుకుంటున్నరేమో. మీ మెడలు వంచి ప్రధానితోనే క్షమాపణ చెప్పించిన విషయం మరిచిపోవద్దు’ అని హెచ్చరించారు. దేశంలో కనీస మద్దతు ధరకు రాజ్యాంగపరమైన రక్షణ ఇస్తూ, రైతుల కోసం సమీకృత నూతన వ్యవసాయవిధానం (ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ) రావాల్సి ఉన్నదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ వేదికగా కార్యాచరణ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. త్వరలో అన్ని రాష్ర్టాల రైతు ప్రతినిధులు, ఢిల్లీలో ఉద్యమం చేసిన రైతు సంఘాలను, ఎకానమిస్టులను హైదరాబాద్‌కు పిలిపిస్తామని వెల్లడించారు. ప్రముఖ ఎకానమిస్ట్ అశోక్ గులాటీ వస్తారని తెలిపారు. వారందరితో వర్క్‌షాప్ పెట్టి పాలసీ డిక్లేర్ చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఖర్మ బాగుంటే ఆ పాలసీని తీసుకొంటుందని, లేదంటే వాళ్లను భారత రైతాంగం గిల్లిపారేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకొంటుందని స్పష్టంచేశారు. ‘వాళ్లే న్యూ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకొంటారు. అప్పుడు కళకళలాడే భారతదేశం ఉంటది. ఇట్లా వెలవెలలాడే దేశం ఉండది. రైతులను బికారులుగా, హీనంగా చూసే భారత దేశం ఉండదు’ అని చెప్పారు. భగవంతుడు తనకిచ్చిన సర్వశక్తులు ధారపోసి ఈ మేరకు ముందుకు సాగుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.