హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) మరో రికార్డు నెలకొల్పింది. శనివారం నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్‌లో సైబర్ నేరాలకు సంబంధించిన 4,893 కేసుల్లో బాధితులకు రూ.33.27 కోట్లను రీఫండ్‌గా అందించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 2,136 కేసుల్లో రూ.12,77,49,117, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 268 కేసుల్లో రూ.8,84,17,621, రాచకొండ పరిధిలోని 592 కేసుల్లో రూ.4,53,06, 114, సీఎస్బీ డీల్ చేసిన 60 కేసుల్లో రూ.1,06,49,044, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 188 మంది బాధితులకు రూ.98,63,438 రీఫండ్ చేసినట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తద్వారా గత లోక్ అదాలత్‌లో అందించిన రూ.27.2 కోట్ల రీఫండ్‌ను అధిగమించినట్టు చెప్పారు. ఇం దుకు సహకరించిన సీఎస్బీ అధికారులు, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లు, డీఎల్ఎస్ఏఎస్లు, సీపీలు, ఎస్పీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 17,210 మంది బాధితులకురూ.155.22 కోట్లు రీఫండ్ చేసినట్టు వెల్లడించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ ద్వారా లేదా cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.