హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన హెల్త్‌సిటీ నిర్మాణ పనులను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ హెల్త్‌సిటీ, టిమ్స్ దవాఖానలు, మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వరంగల్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తుల్లో, రెండు వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న హెల్త్‌సిటీ అందుబాటులోకి వస్తే వరంగల్ మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. ఇందులో ఈఎన్టీ, సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థో, జనరల్ మెడిసిన్, కార్డియో, యూరాలజీ వంటి సేవలతోపాటు అవయవ మార్పిడికి ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తామని వివరించారు. హెల్త్‌సిటీలో అత్యాధునిక మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో టిమ్స్ దవాఖానల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. నిరుడు ప్రారంభించిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో టీచింగ్ దవాఖానల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన డిజైన్లను రూపొందించాలని కోరారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, సీఎంఓఎస్డీ గంగాధర్, అరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ సీఈ రాజేందర్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్యాష్‌లెస్ వైద్యసేవలపై (ఈహెచ్ఎస్) ఉద్యోగులు, టీచర్ల సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి, పది రోజుల్లో నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నూతన విధానంపై చర్యలు వేగవంతం చేయాలని ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చిని ఆదేశించారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు.