ఇప్పటికే రాజకీయ నిపుణులు, ఎన్నికల విశ్లేషకులు తెలంగాణలో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు. ఎన్నికల సమారంగణంలో దూకుడు మీదున్న బీఆర్ఎస్.. అందరికంటే ముందుగా తన అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ఇంకా టికెట్ల పంచాయితీలోనే తలమునకలై ఉన్నాయి. విపక్ష పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసుకోకముందే.. బీఆర్ఎస్ ప్రచార సభలతో జనంలోకి దూసుకెళ్తున్నది.
BRS | హైదరాబాద్, అక్టోబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దే. చరిత్ర చాటిచెప్పిన వాస్తవం ఇదే. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన పార్టీ ఇంతవరకూ లేదని అనేక పర్యాయాలు రుజువైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్.. మూడోసారికూడా విజయ దుందుభి మోగించేందుకు సిద్ధమవుతున్నది. దక్షిణాది రాష్ర్టాల్లో హ్యాట్రిక్ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతున్నది. ఇది గులాబీ నేతలు చెబుతున్న మాట కాదు. సామాన్యుల నుంచి జాతీయ మీడియా, ఎన్నికల విశ్లేషకులు, తలపండిన రాజకీయ పండితుల దాకా ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించడం ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ సెఫాలజిస్టులు సంజయ్‌కుమార్, డాక్టర్ సందీప్శాస్త్రి కూడా బీఆర్ఎస్దే విజయమని ఏకపక్షంగా తేల్చేశారు. జాతీయ మీడియా నిర్వహిస్తున్న ప్రతి చర్చాగోష్టిలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనే మాటే వినిపిస్తున్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై జాతీయ న్యూస్ చానల్స్ టైమ్స్ నౌ, ఇండియా టీవీ నిర్వహించిన సర్వేల్లోనూ తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదని తేలింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ 119 సీట్లకుగాను 63 స్థానాలు గెలుచుకొని కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టింది. తిరిగి 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మొదటి దఫా కంటే 25 సీట్లు అధికంగా గెలుచుకొని ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోగా.. మొదటి దఫా కంటే అధికంగా సీట్లను కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఈ తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా ఆవిర్భవించింది.
ఈసారి జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల క్షేత్రంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ ముందున్నది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే దాదాపు అన్ని సీట్లకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. నెలన్నర కిందట (ఆగస్టు 21) బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 115 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి, ప్రత్యర్థి పార్టీలను కం గుతినిపించారు. తెలంగాణతోపాటు ఈ ఏడాది చివర ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ర్టాల్లో ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించలేకపోయాయి. కానీ తెలంగాణలో మాత్రం కేవలం నాలుగు సీట్లు మినహా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు బీఆర్ఎస్ సవాల్ విసిరింది.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే మునిగితేలుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించడంతో ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలకు అందనంతస్థాయిలో బీఆర్ఎస్ దూసుకుపోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీశ్‌రావు ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని పూర్తి చేశా రు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం సోమవా రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వారం తిరగకుండానే ఈ నెల 15న సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తమ మ్యానిఫెస్టో ప్రతిపక్షాలకు మైండ్‌బ్లాక్ అయ్యేలా ఉండబోతున్నద ని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. తెలంగాణలో బీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి తావులేదని నిరూపించింది. రాష్ట్ర అవిర్భావం తర్వాత తెలంగాణ శాసనసభకు 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 119 సీట్లకుగాను బీఆర్ఎస్ 63 సీట్లతో 34.04 శాతం ఓట్లు, రెండో దఫా 2018లో జరిగిన ఎన్నికల్లో 88 సీట్లతో 46.90 శాతం ఓట్లు కైవసం చేసుకొన్నది. అసెంబ్లీతో పాటు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకుగాను 11 గెలుచుకొని 34.67 శాతం ఓట్లు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకొని 41.30 శాతం ఓట్లు కైవసం చేసుకొన్నది. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే 2019లో 2 సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా 34.67 నుంచి 41.30 శాతానికి పెంచుకోవడం విశేషం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా వివిధ కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. 2014లో జరిగిన మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో 55 శాతం, 2015లో జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో 60 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించింది. 2016లో జరిగిన నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో 60 శాతం ఓట్లు గెలుచుకోగా, పాలేరు ఉప ఎన్నికల్లో 55 శాతం, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో 56 శాతం, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో 40.78 శాతం, మునుగోడులో 42.95 శాతం ఓట్లు కైవసం చేసుకొని, రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి బీఆర్ఎస్సేనని నిరూపించుకొన్నది.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా ఏకధాటిగా తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరితూగే నాయకులు అటు కాంగ్రెస్‌లో కానీ, ఇటు బీజేపీలో కానీ లేకపోవడం రాజకీయ ప్రత్యర్థులకు ప్రధాన బలహీనతగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ 68 సీట్లను గెలుచుకోగా, మలి ఎన్నికల్లో పార్టీ మరింత బలపడి ఏకంగా 88 సీట్లను కైవసం చేసుకొన్నది. దీంతో విపక్ష పార్టీలకు భవిష్యత్తు లేదని, నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా డజన్‌కుపైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడంతో ఈ సంఖ్య వంద దాటింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో మరిన్ని ప్రజారంజక హామీల కోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తమ మ్యానిఫెస్టో ప్రకటిస్తే రాజకీయ ప్రత్యర్థులు కకావికలం కాకతప్పదని బీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉన్నది. ప్రజలంతా తమవైపే ఉండటంతో హ్యాట్రిక్ పక్కా అనే ధీమాతో ముందుకెళ్తున్నది.