హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్ పోస్టుల భర్తీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుల భర్తీలో తమ పేర్లను కూడా పరిశీలించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మహిళా ఓటర్లు కారణమని, అందుకు కృషి చేసిన మహిళా నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేస్తున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన గాంధీభవన్‌లో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన మహిళా నేతలందరికీ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో సహా ఆఫీస్ బేరర్స్ అందరి నుంచి దరఖాస్తులు తీసుకొని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అందజేసినట్టు చెప్పారు. సమావేశంలో ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హసీనా, ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.