హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలు ఒకేసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌పై అసంతృప్త ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో ఖర్గేను కలిశారు. ఈ భేటీలో మంత్రి దామోదర కూడా పాల్గొనడం గమనార్హం. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు ఆపరేషన్ అయింది. దీంతో పలువురు ఆయన్ను కలిసి పరామర్శిస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై నిత్యం అసంతృప్తి వ్యక్తంచేస్తున్న నేతలు కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యం సం తరించుకున్నది. ఈ సందర్భంగా ఖర్గే ఆ ఎమ్మెల్యేల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అదేవిధంగా అసంతృప్త నేతలు ఖర్గేకు పలు అంశాలపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా అనిరుధ్‌రెడ్డి పలువురు మంత్రులకు సంబంధించిన అవినీతిపై వివరించినట్టు తెలిసింది.
ఒక కీలక మంత్రికి సంబంధించిన భూ కుంభకోణాలపై కొద్దిరోజులుగా తాను చేస్తున్న పోరాటాన్ని కూడా ఖర్గేకు వివరించినట్టు సమాచారం. దీంతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ మధ్య, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య, మంత్రి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న వివాదాలను కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. మంత్రుల మధ్య నెలకొన్న వివాదాలతో రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరువు పోతున్నదని, ప్రజలు ఈసడించుకుంటున్నారని ఖర్గేకు చెప్పినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రుల మధ్య సమన్వయం చేయడంలోనూ, మంత్రులను గాడిలో పెట్టడంలోనూ, పాలనలోనూ విఫలమయ్యారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎవరికి వారు తమ సొంత ఎజెండాను అమలుచేస్తున్నారని, పార్టీని పట్టించుకోవడం లేదని చెప్పినట్టు తెలిసింది. సీఎంతోపాటు మంత్రుల చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం చేస్తున్నాయని ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.