హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో పదవుల పంపకాన్ని మూడు క్యాటగిరీలుగా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కీల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీలోని నేతలను మూడు క్యాటగిరీలుగా విభజించాలని నిర్ణయించినట్టు సమాచారం. తొలి నుంచి పార్టీలో ఉన్న వారిని ఒక క్యాటగిరి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారిని రెండో క్యాటగిరి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వారిని మూడో క్యాటగిరీగా గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఫార్ములా ఆధారంగా పదవుల సం ఖ్యను బట్టి, పార్టీకి చేసిన సేవల ఆధారంగా పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌తో మీనాక్షి భేటీ
మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పర్యటన బుధవారం ముగిసింది. రెండురోజులపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలతోపాటు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఆమె సమావేశాలు నిర్వహించారు. బుధవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్న మీనాక్షి నటరాజన్ పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తాను స్ట్రిక్ట్‌గా ఉంటానని, తనతీరు నచ్చకపోతే అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఎవరు పనిచేస్తున్నరో, ఎవరు యాక్టింగ్ చేస్తున్నరో తన వద్ద సమాచారం ఉన్నదని ఆమె చెప్పడంతో నేతలు కంగుతిన్నారు. పార్టీ అభివృద్ధికి పనిచేయాలని, పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట చర్చించకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పార్టీ సీనియర్ నేత కే జానారెడ్డితో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమై, పార్టీ పరిస్థితిపై చర్చించినట్టు సమాచారం. గాంధీభవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్చార్జీల పనితీరు బాగోలేదని, అందుకే బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పినట్టు తెలిసింది.
7న ఢిల్లీ సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎం పిక, కార్పొరేషన్ పదవుల భర్తీ, కాంగ్రెస్ కమిటీల కూర్పు అంశాలపై రాష్ట్ర నేతలతో పార్టీ అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించనున్నది.