వీర్నపల్లి, జనవరి 4 : యూరియా కోసం మళ్లీ రైతులు బారులు తీరాల్సి వస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం వందలాదిమంది యూరియా బస్తాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. గోదాం వద్దకు యూరియా లారీ వచ్చిందన్న సమాచారం అందడంతో భూక్యాతండా, బాబాయిచెరువుతండా, బావుసింగ్తండా గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు చేరుకున్నారు.
స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సొసైటీ సిబ్బంది టోకెన్లు ఇస్తుండటంతో రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నారు. ఒక్కో రైతుకు మూడు యూరియా బస్తాలు మాత్రమే ఇచ్చారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటే మూడు బస్తాలు మాత్రమే ఇవ్వడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పది రోజులుగా నిరీక్షిస్తున్నామని, సాగుకు అవసరమైన యూరియా ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.
బీఆర్ఎస్ హయాంలో సొసైటీల్లో యూరియా అవసరమైన మేర సరఫరా జరిగేదని తెలిపారు. ఇప్పుడు కొరత సృష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఏవో జయను ఫోన్లో సంప్రదించగా అల్మాస్పూర్ సొసైటీ పరిధిలోని వీర్నపల్లికి ఇప్పటికే మూడు లారీల యూరియా వచ్చిందని, మరో ఏడు లారీల లోడ్ రావాల్సి ఉన్నదని తెలిపారు. రైతులందరికీ యూరియా అందించాలనే మూడు బస్తాల చొప్పున పంపిణీ చేశామని వెల్లడించారు.