!కాంగ్రెస్‌లో రేవంత్ ఆట ముగిసినట్టేనా? ఇటీవలి పరిణామాలకు తోడు, తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఇదే విషయం సుస్పష్టమవుతున్నది. ఆయన తన సహచరుడు వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో రేవంత్‌రెడ్డి మనిషి ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
Congress | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసం తాపత్రయపడిన రేవంత్‌ను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి కూడా రానివ్వలేదని స్పష్టమవుతున్నది. తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడుకోలును అధిష్ఠానం లైట్ తీసుకున్నట్టు తేలిపోయింది. తన ఆత్మగా ముద్రపడిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ కోసం రేవంత్ చేసిన విశ్వప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో రేవంత్ దాదాపు గంట పాటు చర్చించి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా, చివరికి ఢిల్లీకి వెళ్లి పైరవీ చేసినా పట్టించుకోకుండా హైకమాండ్ అన్నీతానై ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారం ప్రకటించింది. అద్దంకి దయాకర్‌తో పాటు రేవంత్ సూచించని విజయశాంతి, శంకర్‌నాయక్ పేర్లను ఖరారు చేసింది. వీరిలో 15 నెలలుగా అసలు రేవంత్‌రెడ్డిని కలవను కూడా కలవని విజయశాంతి పేరు ఉండడం గమనార్హం.
పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించినట్టు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరు సోమవారం ఉమ్మడిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటీవలే ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, అధిష్ఠానం తనను ఏమీ చెయ్యనివ్వటం లేదని, అన్ని నిర్ణయాలూ హైకమాండే తీసుకుంటున్నదని, సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగులను కూడా అక్కడే నిర్ణయిస్తున్నారని మొరపెట్టుకున్న 72 గంటల్లోనే పార్టీ అధిష్ఠానం అంతకంటే బలమైన నిర్ణయంతో ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. దీంతో ఇక ఆడింది ఆటగా సాగదని రేవంత్‌కు పార్టీ అధిష్ఠానం బలమైన సంకేతాలు ఇచ్చినట్టయిందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చనడుస్తున్నది.
వేం కోసం ఏం చేసినా..!
ఓసీ కోటాలో తనకు అత్యంత సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి టికెట్ ఇప్పించుకొనేందుకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను అణగదొక్కారన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని, మరో సీనియర్ నేత జగ్గారెడ్డిని పక్కన పెట్టి, వేంకు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. నరేందర్‌రెడ్డి పేరును జాబితాలో తెచ్చేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన ప్రతిపాదనను ఒక కీలక మంత్రి వ్యతిరేకించే అవకాశం ఉన్నదని ముందే పసిగట్టి లాబీయింగ్ చేసినట్టు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి ఆయనను ఒప్పించినట్టు తెలిసింది.
తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌పై ఒత్తిడి తెచ్చి వేం పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. నలుగురు సభ్యులున్న ఎంపిక కమిటీలో ముగ్గురు సభ్యులు వేంకు అనుకూలంగా ఉండటంతో నాలుగో సభ్యుడిగా ఉన్న కీలక మంత్రి ఒకరు ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నారని సమాచారం. మంత్రి పొంగులేటి సిఫారసు మేరకు ఎస్టీ కోటా కింద ఖమ్మం జిల్లాకు చెందిన విజయాభాయికి సీటు ఇప్పించాలని ప్రయత్నించినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డి పట్టుబట్టి టీపీసీసీ మీద ఒత్తిడి చేసి వేం నరేందర్‌రెడ్డి, విజయాభాయి పేర్లతో పాటు అద్దంకి దయాకర్ పేరును అధిష్ఠానికి పంపగా వారిలో ఇద్దరిని పక్కన పెట్టి అద్దంకికి అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు విజయశాంతి పేరును అధిష్ఠానం ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. శంకర్‌నాయక్ కోసం పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఏకంగా అధిష్ఠానం వద్దే చక్రం తిప్పినట్టు చర్చ నడుస్తున్నది.
గడ్డుకాలం మొదలైనట్టే!
సీనియర్లను పట్టించుకోకుండా వలస వాదులకే రేవంత్ ప్రాముఖ్యత ఇస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు పదేపదే అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్‌కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్‌మున్షీని తెలంగాణ బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించినట్టు స్పష్టమవుతున్నది. ఆమెకు బదులు రాహుల్‌గాంధీ సొంత టీం సభ్యురాలు మీనాక్షి నటరాజన్‌ను రాష్ట్ర ఇన్చార్జిగా నియమించారు. మీనాక్షి రావటంతోనే తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి గుత్తాధిపత్యానికి కాలం చెల్లిందనే వాదనలు వినిపించాయి. మీనాక్షి రాక రేవంత్ మార్పునకు తొలిమెట్టు అని కూడా పార్టీ శ్రేణుల్లో ప్రచారమైంది. ఈ చర్చ సాగుతుండగానే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడం, రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లను పక్కనపెట్టి, రేవంత్‌ను ఢిల్లీకి రాకుండా నిరోధించడం, అధిష్ఠానం అనుకున్న వాళ్లకే టికెట్లు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థుల్లో రేవంత్ మనిషి ఒక్కరైనా లేకపోవడం గమనార్హం. నిజానికి విజయశాంతి పేరు ఎప్పుడూ తెర మీదికి రాలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో మాత్రమే ఆమె మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. మళ్లీ ఎప్పుడూ ఆమె ఆయన ముఖం చూడలేదు. కానీ అనుహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. మూడు రోజుల కిందటే ఢిల్లీకి వెళ్లిన విజయశాంతి అక్కడ మంత్రాంగం చేసి టికెట్ తెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆమె, అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆమె పార్టీలో చేరినప్పుడే ఎమ్మెల్సీ పదవి హామీ తీసుకున్నారని, అదే విషయం ఏఐసీసీకి గుర్తు చేసి టికెట్ సాధించారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ప్రకటన వచ్చే వరకు శంకర్‌నాయక్ కూడా రేసులో లేరు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి నేరుగా అధిష్ఠానంతో మాట్లాడి శంకర్ నాయక్‌కు టికెట్ ఇప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. తుంగతుర్తి అసెంబ్లీ సీటు త్యాగం చేసిన అద్దంకి దయాకర్ పేరు మొదటి నుంచీ వినిపిస్తున్నదే. ఈ దెబ్బతో రేవంత్‌కు గడ్డుకాలం మొదలైనట్టేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
మా వద్దకు రావొద్దు..!
కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు ముఖ్యమంత్రులు వస్తానంటే వద్దన్న సందార్భాలు ఎప్పుడూ లేవని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వస్తానని అడిగినా హైకమాండ్ దూరం పెట్టిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ఢిల్లీ పర్యటన ఖరారైన తర్వాత కూడా రావాల్సిన అవసరం లేదని సందేశం పంపి, రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లను పక్కనపెట్టి హైకమాండే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించటంతో ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ పని అయిపోయినట్టేనన్న అభిప్రాయాలు పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. కొన్ని నెలల నుంచే రేవంత్‌రెడ్డికి హైకమాండ్‌తో సంబంధాలు బలహీనపడ్డాయని, అనేక సార్లు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సోనియా గాంధీ బహిరంగంగానే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలోనే రేవంత్ ఎన్నిసార్లు కోరినా మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం అనుమతించ లేదని, పార్టీ నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ విస్తరణకు కూడా అంగీకరించలేదని వారు అంటున్నారు. రాహుల్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కుల గణనను రేవంత్ అస్తవ్యస్తంగా చేశారన్న ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీసీ జనాభా 50 శాతానికి పైగా ఉన్నదని తెలంగాణలో తాము చేసిన కులగణన సర్వేలో తేలిందని రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించిన రోజే సీఎం రేవంత్‌రెడ్డి పనిగట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి 46 శాతమే ఉన్నదని ప్రకటించటంతో రాహుల్ ఖిన్నుడైనట్టు సదరు నేత వివరించారు. ‘అతను (రేవంత్‌రెడ్డి) మన కంట్రోల్లో ఉన్నాడా? బీజేపీ ముసుగు కిందికి వెళ్లిపోయాడా? కనుక్కోండి’ అని సదరు నేతతో చెప్పినట్టు సమాచారం.