తిమ్మాపూర్/గన్నేరువరం, ఆగస్టు 8 : ‘ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందు నిలుపుతున్న బీఆర్ఎస్ది అభివృద్ధి విధానమని.. ఓర్వలేని ప్రతిపక్షాలు దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నాయి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఉద్ఘాటించారు. రాష్ట్రం రాక ముందు ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవి..ఇప్పుడు ఎలా ఉన్నవో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. నిధులు, నీళ్లు, నియామకాలు లేక యువత తీవ్రవాదంపై ఆకర్షితులవుతున్నదని గుర్తించే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పారు.
కొట్లాడి సాధించిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గన్నేరు మండలం గుండ్లపల్లి వద్ద డబుల్‌రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో గన్నేరువరం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీడు భూములకు నీరందిస్తున్నారన్నారు. 25 వేల మెగావాట్ల వపర్ ప్లాంట్ల నిర్మాణంతో 24 టంటల ఉచిత కరెంట్ అందుతున్నదన్నారు. మిషన్ కాకతీయ కింద 44 వేల చెరువులను పునరుద్ధరించామన్నారు. ఈ కారణంగానే మొన్న కురిసిన భారీ వర్షాలకు ఒక్క చెరువు కట్టకూడా తెగలేదని చెప్పారు.
కొందరు ప్రతిపక్ష నాయకులు సీఎం కేసీఆర్ అప్పులు చేస్తున్నారని అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు చేస్తున్నది అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. ఈసందర్భంగా యాదవులు గొంగడి వేసి గొర్రెపిల్లను బహూకరించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఉన్నారు.