హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): దావోస్ పర్యటనతో రాష్ర్టానికి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దావోస్‌లో 28 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని అన్నారు. రాష్ట్రాన్ని లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారికి అవసరమైన భూ కేటాయింపులు, అనుమతులు వంటివి ఇచ్చి ప్రోత్సహిస్తామని అన్నారు. నిరుడు దావోస్ పర్యటనలో మొత్తం 15 కంపెనీలతో 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయన్నారు. ఇందులో 10 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, 7 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నట్టు వెల్లడించారు.
తాజా పర్యటనలో విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. కొందరు దావోస్ పెట్టుబడులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కావాలంటే మీడియా ప్రతినిధులు నిజనిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా సంస్థల వద్దకు వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవచ్చని అన్నారు. హైదరాబాద్ కంపెనీలతో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆయా సంస్థలు తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకే దావోస్‌కు వెళ్లాయని చెప్పారు. దావోస్‌కు కేవలం పెట్టుబడుల కోసమే వెళ్లలేదని, ప్రపంచ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు వెళ్లామని తెలిపారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రూ. 1.180 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడాన్ని తాము విజయంగా భావించడం లేదని, వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేసిన ఎనర్జీ పాలసీ వల్లే పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు బాలూనాయక్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్మీట్లో సీఎంతోపాటు పలువురు మంత్రులు, నేతలు నిద్రమత్తులో కనిపించారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో సీతక్క, జూపల్లి కృష్ణారావు, చిన్న కునుకు తీశారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా సీఎం ఆవులింతలు తీస్తూ, నిద్రను ఆపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలదీ అదే పరిస్థితి. మొత్తంగా చెప్పేదంతా పాత విషయమే కావడంతో ప్రెస్‌మీట్ మొత్తం నిద్రమత్తులో సాగినట్టయ్యింది.