Telangana Cabinet | హైదరాబాద్, మార్చి 24 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణను 14 నెలలుగా పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం తుది కసరత్తు మొదలుపెట్టింది. మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి, ఇతర సీనియర్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఇవాళో, రేపో ఏ క్షణమైనా జాబితా విడుదల చేసే అవకాశముంది. రాష్ట్రంలో 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకొనే వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. ఇంకో ఆరుగురికి అవకాశం ఉన్నది. ఈ ఆరు పదవులకు 30 మంది పోటీ పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి పదవి ఆశిస్తున్నవారంతా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. పోటీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, విజయశాంతి, అమీర్‌అలీఖాన్, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు పేర్లు ముందు వరుసలో ఉన్నట్టు తెలిసింది. మంత్రి పదవులతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికను కూడా అధిష్ఠానం పూర్తి చేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. మంత్రి పదవులతోపాటు పార్టీ పదవుల భర్తీలో రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికల ఆధారంగానే అధిష్ఠానం భర్తీలు చేపడుతున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆ పార్టీ కీలక నేతలైన ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీ అయ్యారు. భేటీలో మంత్రివర్గ కూర్పు అంశం కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. అయితే మంత్రివర్గంలో ఉన్న ఆరు ఖాళీలను భర్తీ చేయాలా? లేక నాలుగింటినే భర్తీ చేయాలా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ భేటీకి ఆలస్యంగా హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందరికన్నా ముందే బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత 20 నిమిషాలకు రేవంత్, మరో అర్ధగంట తర్వాత భట్టి బయటకు వచ్చినట్టు సమాచారం. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై పార్టీ అధిష్ఠానంతో చర్చినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు.