CM KCR | విశ్వమానవుడు అంబేద్కర్ విశ్వరూపం సాక్షాత్కారమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కృతమైంది. ‘జై భీమ్’ నినాదాల మధ్య బాబాసాహెబ్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాబోయే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలయ్యే రోజు త్వరలోనే రానున్నదని చెప్పారు. అదే జరిగితే ప్రతి సంవత్సరం 25లక్షలమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఇటీవల మహారాష్ట్రకు వెళ్లినప్పుడు తాను కలలో కూడా ఊహించనంత ప్రజాస్పందన వచ్చిందని, రేపు దేశమంతా బీఆర్ఎస్కు ఇదే తరహాలో సానుకూలత వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో దేశాన్ని సరైన దిశలో నడిపించడానికి చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మహావిగ్రహ నీడలో జరిగిన సభలో కేసీఆర్ అనేక అంశాలపై మాట్లాడారు. అనేక ఆలోచనలను పంచుకున్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో, ఎవరో అడిగితేనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైన విశ్వమానవుడి విశ్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం వెనుక ఒక బలమైన సందేశం ఉన్నది. రాష్ట్ర పరిపాలన సౌధమైన సెక్రటేరియట్ కూడా ఇక్కడే ఉన్నది. దానికి కూడా అంబేద్కర్ పేరే పెట్టుకున్నం. దానిముందే అమరుల స్మారకం ఉన్నది. హుస్సేన్‌సాగర్ మధ్యలో అంబేద్కర్ నమ్మిన బుద్ధుడి విగ్రహం ఉన్నది. ఇవన్నీ అద్భుతమైన, సందేశాత్మక చిహ్నాలు. రోజూ సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అంబేద్కర్‌ను చూసి ప్రభావితం కావాలి. ఆనునిత్యం ఆయన సిద్ధాంతం, ఆచరణ కండ్లల్లో మెదలాలి. వారు ఆ మార్గంలో ప్రయాణించాలి. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులు కూడా మనకు ఆదర్శం కావాలి. అందుకే ఈ కాంప్లెక్స్‌ను ఈ విధంగా రూపకల్పన చేశాం. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక చిట్టీ రాసి పంపిండు. ‘ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలల సాకారం చేసే చైతన్య దీపిక’ అని అందులో రాసి ఇచ్చాడు. ఇది అక్షరసత్యం. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి అహోరాత్రులు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ప్రయత్నాన్ని గతంలో కడియం శ్రీహరి ప్రారంభిస్తే.. కొప్పుల ఈశ్వర్ కొనసాగించారు. అనేక దేశాలు తిరిగి, సుందరమైన ఈ విగ్రహాన్ని మనకు అందించేందుకు ఆయన ఏండ్లపాటు కృషి చేశారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వయంగా ఇంజినీర్ కాబట్టి నిర్మాణం విషయంలో చాలా ప్రయాస పడ్డారు. వారం రోజులుగా ఆయనకు నిద్రాహారాలు లేవు. తుది మెరుగులు దిద్దేందుకు బ్రహ్మాండమైన కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, ఈఎన్సీ గణపతి రెడ్డికి, ఆర్అండ్బీ సిబ్బందికి, నిర్మాణ సంస్థకు, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు.

12
బాధతో అయినా సరే మనం ఒక విషయాన్ని అంగీకరించక తప్పదు. రాజ్యాంగం అమలు ప్రారంభమై 70 ఏండ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా.. ఇప్పటికీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుపేదలు ఎవరంటే దళితులు అనే మాట వినిపించడం మనందరికీ సిగ్గుచేటు. మరి ఇన్నేండ్లు ఏం చేస్తున్నట్టు? ఈ పరిస్థితి మారాలె. దేశంలో ఒక పార్టీ ఓడిపోయి ఇంకోపార్టీ గెలువడం కాదు, ప్రజలు గెలిచే రాజకీయం రావాలి. దానికోసం దళిత మేధావి వర్గం ఆలోచించాలి. అన్నం ఉడికిందా, లేదా? అని చూడటానికి మొత్తం కుండను పిసికి చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎవరి వైఖరి ఏ విధంగా ఉన్నది? ఏ దారిలో పనిచేస్తున్నరు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నదో చెప్పేందుకు రెండు మూడు విషయాలు చెప్తాను.

కొన్ని విషయాలు చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలె. గతంలో ఓ సందర్భంలో నేను.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా’ అని చెప్పిన. అక్షరాలా అదే జరిగింది. పార్లమెంట్లో బిల్లు పాసై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే, తిరిగి ఈ ప్రాంతానికి వచ్చాను. నేను తెలంగాణలో చేస్తున్న కార్యక్రమాలనే దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పార్టీని విస్తరించాను. తప్పకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో రాబోయే రాజ్యం మనదే.. మనదే.. మనదే. ఇది కొంతమందికి మింగుడు పడకపోవచ్చు. కానీ.. ఒక ఉద్యమం అంటుకోవడానికి చిన్న మిణుగురు లేదా ఒక అగ్గిరవ్వ ఉంటే చాలు. ఈ మధ్య నేను మహారాష్ట్రకు పోతే నా కలలో కూడా ఊహించని ప్రోత్సాహం, ఆదరణ దక్కింది. ఈ రోజు మహారాష్ట్రలో వచ్చినట్టే రేపు ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో, బెంగాల్లో, ఇలా ప్రతిచోట కూడా వస్తుంది. ఈ మహనీయుడి జయంతి సందర్భంగా మరో విషయం ప్రకటిస్తున్నాను.
దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు వంటి పథకం అమలు చేస్తాం. అన్ని రాష్ర్టాల దళితులకు ఈ సదుపాయం అందుతుంది. అంబేద్కర్ కలలు ఇంకా నెరవేరలేదు. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన కలలు సాకారం కావాలె. తప్పకుండా అవుతాయి. దయచేసి మీరందరినీ కోరేది ఒక్కటే. ఏదో ఒక ఒరవడిలో కొట్టుకుపోవడం కాకుండా, గాలివాటంగా పోవడం కాకుండా.. ఎవరైతే నిర్దంద్వంగా, నిజమైన భక్తితో దేశ ప్రజలను ఆశీర్వదించే దిశగా పోతున్నరో వారికే మీ బలం అందాలి. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఇంత అద్భుతమైన, ఆదర్శమూర్తి విగ్రహాన్ని, ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. దీనిని ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ బాటలో తెలంగాణ రాష్ర్టాన్నే కాదు, భారత దేశాన్ని కూడా సరైన దిశలో పెట్టడానికి చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తాను. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. జై భీమ్’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజైన శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణలో పలు యూనివర్సిటీ విద్యార్థులకు ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది. వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో 400 మందికి పైగా విద్యార్థులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. దీంతో ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ మహిళా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలకు చెందిన విద్యార్థులకు విగ్రహావిష్కరణను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చొరవతో విగ్రహావిష్కరణ సభలో వర్సిటీ విద్యార్థులకు ప్రత్యేక గ్యాలరీని కేటాయించారు. విద్యార్థులు అంబేద్కర్ స్మృతివనానికి చేరుకొని విగ్రహావిష్కరణ ఘట్టాన్ని తిలకించి పులకించిపోయారు. వీరితో పాటు పలు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు వెంకటరమణ, తాటికొండ రమేశ్, రవీందర్‌గుప్తా, గోపాల్‌రెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్, సీతారామారావు, విజ్జుల్లత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిత్రుడు కత్తి పద్మారావు ఈ రోజు మీడియా ముఖంగా నాకొక సూచన చేశారు. అంబేద్కర్ పేరిట శాశ్వత అవార్డు నెలకొల్పితే బాగుంటుందని కోరారు. దీనిపై ఉదయమే చర్చించి నిర్ణయం తీసుకున్నాం. అంబేద్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధికి రూ.51 కోట్లు డిపాజిట్ చేస్తున్నాం. ఈ మేరకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తాం. దాని ద్వారా ఏటా రూ.3 కోట్ల వరకు వడ్డీ వస్తుంది. ఆ డబ్బుతో మన రాష్ట్రంతోపాటు దేశంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రతి అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు అందిస్తాం. ఈ రూ.51 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుంది. తద్వారా ఆయన పేరు ప్రతిష్ఠలు శాశ్వతంగా ఉంటాయి.
అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. ఒక ఊరికో, ఒక రాష్ర్టానికో, ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆయన ఒక ఆశాదీపం. ఆయన రచించిన, మనకు మార్గదర్శనం చేసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోతున్నది. మనం ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నాం. పాటలు పాడుతున్నాం, ఆటలు ఆడుతున్నాం, మన ఆక్రోషాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నాయి. మనం గుండెమీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించాలె. అంబేద్కర్ జయంతిని జరుపుకొంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఆచరించేది ఏమైనా ఉన్నదా? ఆ దిశగా కార్యాచరణ ఉన్నదా, లేదా?.. ఇదీ ఈ రోజు దేశం ప్రశ్నించుకోవాల్సింది. ఆటలు, పాటలు, అలపోతలు, తలపోతలు కాదు.. కార్యాచరణ ప్రారంభం కావాలె, ఆచరణాత్మకమైన ప్రారంభోత్సవం కావాలె.
అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనం. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఇంత గొప్పగా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం నాకు చాలా గర్వంగా ఉన్నది. దీనిని ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. రోజూ సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రులు, మంత్రు
– ముఖ్యమంత్రి కేసీఆర్
వాజపేయి తరువాత దేశంలో నాకు జాతీయ నేత ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు దేశంలో ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో వినూత్న పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తన ఆలోచనలతో దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా మారాలి. ఆ బాధ్యతను స్వీకరించి కేసీఆర్ ముందడుగేస్తే మిగతా ముఖ్యమంత్రులూ ఆయన వెంట నడుస్తారు.
– ప్రకాశ్ అంబేద్కర్
నగర నడిబొడ్డున సగర్వంగా.. సమున్నతంగా అంబేద్కర్‌ను గౌరవించుకోవడం శుభసూచకమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ కొనియాడారు. చరిత్రలో లిఖించదగ్గ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యావేత్తలు, వర్సిటీల వీసీలను ప్రత్యేకంగా ఆహ్వానించి, అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.