ఢిల్లీ అబద్ధంపై రైతన్న యుద్ధం
హస్తినను కమ్ముకున్న గులాబీ సేనలు
ఇలాంటి దీక్ష దేశ చరిత్రలో తొలిసారి
మోదీ సర్కారు మెడలు వంచేదాకా పోరు
వడ్ల కొనుగోళ్లపై కేంద్రానికి నేడు అల్టిమేటం
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న టీఆర్ఎస్ నేతలు
రెండున్నర వేల మందికి భోజనాలు
గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో ఢిల్లీకి కొత్త కళ
పాల్గొననున్న రైతు ఉద్యమ నేత టికాయిత్
ఆసక్తిగా చూస్తున్న రాజకీయ పరిశీలకులు
దీక్ష తర్వాత కేంద్రంపై పోరు మరింత తీవ్రం
రైతు ఉద్యమానికి టీఆర్ఎస్ కొత్త దారులు
దేశానికి సమగ్ర సాగు విధానం కావాలి:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
రైతుల ఆదాయం పోగొట్టిన బీజేపీ:ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
మునుపెన్నడూ చూడని దృశ్యం.. ఇప్పుడు ఉత్తరాది రైతులను అచ్చెరువొందిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కేంద్రంపై సమరశంఖం పూరిస్తున్న సన్నివేశం.. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. తాను ఇష్టపడి, కష్టపడి రాజును చేసిన రైతు.. కేంద్రం కుటిల బుద్ధితో కుదేలవుతుంటే.. సహించలేక పోరు జెండా ఎత్తిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో యావత్తు రాష్ట్రం కేంద్రంపై వరి కంకుల జంగ్ ప్రకటించింది.
వడ్లను అడ్డుపెట్టుకొని అడ్డమైన రాజకీయాలకు ప్రయత్నిస్తున్న బీజేపీని బండకేసి ఉతికేందుకు తెలంగాణ రైతన్న పూరించిన సైరన్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నది. సీఎం సహా యావత్తు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఢిల్లీ దీక్ష ద్వారా.. మేం
‘బాయిల్డ్ రైస్’ బాధితులం కాబోమంటూ కేంద్రానికి అల్టిమేటం జారీచేయనున్నది.
కేంద్రం ధోకాతో బిత్తరపోయిన ఇతర రాష్ర్టాల బాయిల్డ్ రైస్ బాధిత రైతులకు ఈ దీక్ష ఆశాకిరణంగా గోచరిస్తున్నది. మోదీ మెడలు వంచి దిక్కుమాలిన సాగు చట్టాలను రద్దుచేయించిన రైతు నేతలు ఈ దీక్ష రైతు హక్కుల పోరాటంలో కీలక మలుపు కాగలదని అంటున్నారు. తాము సైతం దీక్షలో పాల్గొననున్నట్టు రైతు నేత టికాయిత్ ప్రకటించారు. కేంద్ర ప్రతీకార రాజకీయాలకు భయపడి ఇంతకాలం నోరెత్తని ఇతర రాష్ర్టాలూ మా బాయిల్డ్ రైస్ సంగతేందని నిలదీస్తున్నాయి.
కేంద్రంపై పోరుకు తెలంగాణ యోధులు హస్తినను కమ్ముకొన్నారు. వీధివీధినా రైతు దీక్ష ఫ్లెక్సీలే.. ఎక్కడ చూసినా దీక్ష గురించిన చర్చలే. రైతుల కోసం ఏకంగా ఓ ప్రభుత్వ పోరాటం చూస్తున్న ఉత్తరాది రైతులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వమంటే ఇది కదా అని ఢిల్లీ వీధుల్లో ఆటోవాలాలు అనటం వినిపిస్తున్నది. ఇదే అంతిమం కాదని, వడ్లు కొనేదాక, మోదీ సర్కారు మెడలు వంచేదాక ఈ పోరాటం ఆగేది లేదని టీఆర్ఎస్ నాయకత్వం విస్పష్టంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అహంకారంపై తెలంగాణ ఆత్మగౌరవ జంగ్ ఉప్పెనలా ఎగిసిపడుతున్నది. వడ్లను అడ్డుపెట్టుకొని కుటిల రాజకీయానికి తెరలేపిన బీజేపీకి బుద్ధిచెప్పేందుకు తెలంగాణ పోరాట యోధులు హస్తినను కమ్ముకొంటున్నారు. ధాన్యం సేకరణలో మోదీ ప్రభుత్వ వివక్షను దేశం మొత్తానికి తెలిసేలా చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం చేపడుతున్న దీక్షకు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు టీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్‌కు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 22 విమానాలు రాగా, అందులో ఎకువగా వచ్చింది గులాబీ సైనికులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే. విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు 10 బస్సులు, 35 కార్లతో నేతలు, కార్యకర్తలను తరలించారు. అందరికీ జిల్లాలవారీగా వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, రాజ్యసభలో ఉప నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కవిత, నిరసన దీక్ష కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, గణేష్ బిగాల తదితరులు దీక్ష ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్లు పూర్తి
నిరసన దీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీక్ష పర్యవేక్షణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, పార్టీ శాసనసభ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పూర్తిచేశారు. పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు. ఎండవేడి ఎకువ ఉండటంతో దీక్షా స్థలి వద్ద కూలర్లు పెట్టారు. దీక్షకు వచ్చేవారందరికీ మజ్జిగ, మంచినీళ్లు, భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండున్నర వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
సమగ్ర వ్యవసాయ విధానం కావాలి: కవిత
జాతీయ స్థాయిలో రైతులందరికీ మేలు చేసేలా సమగ్ర వ్యవసాయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి రైతుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరారు. ధాన్యం సేకరణ మొత్తం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, లేదంటే కనీస మద్దతు ధరకు అర్థమే లేదని అన్నారు. తెలంగాణ రైతుల పంట సేకరణపై కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక చర్యలతో బీజేపీ సరారు అభాసుపాలవుతున్నదని, నల్ల చట్టాలు చేసి చెయ్యి కాల్చుకున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలతో గత ఎనిమిదేండ్లలోనే పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో చూపుతున్న వివక్షతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు 15 రోజులు పార్లమెంటులో ఆందోళన నిర్వహించినా కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రం కండ్లు తెరిపించేందుకే దీక్ష : సురేశ్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలు వివాదాస్పదంగా ఉన్నాయని రాజ్యసభలో టీఆర్ఎస్ ఉప నాయకుడు కేఆర్ సురేశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికో విధానంతో కేంద్రం రైతులను ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. మోదీ సర్కారు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతుల గొంతు వినిపించేందుకే ఢిల్లీలో దీక్ష చేపట్టామని చెప్పారు. ఈ దీక్షతోనైనా కేంద్రం కండ్లు, చెవులు తెరుస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
40 అడుగుల వేదిక
వడ్ల దీక్షకు తెలంగాణ భవన్ వద్ద 40 అడుగుల వేదికను నిర్మించారు. రెండు వేల మందికిపైగా ప్రతినిధులు కూర్చొనేలా వేదిక కింద ఏర్పాట్లు చేశారు. దీక్షా స్థలికి వచ్చే వారంతా కిందనే కూర్చోవాలి. కుర్చీలను వేయలేదు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపాలను వేదిక సమీపంలోనే ఏర్పాటుచేశారు. ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసే ఏర్పాట్లు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కూడా సోమవారమే కావటంతో దీక్షకు వచ్చేవారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే ఏర్పాట్లు ఉన్నాయి. దీక్ష ఉదయం పది గంటల నుంచి మొదలవుతుంది. తెలంగాణ భవన్‌కు పక్కనే ఉన్న నర్సింగ్ కళాశాలకు సంబంధించిన ప్రాంగణంలో భోజన ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీలో తెలంగాణ హోరు
ఢిల్లీ వీధులన్నీ టీఆర్ఎస్ నేతలతో నిండిపోయాయి. ఎకడ చూసినా రైతులకు న్యాయం చేయాలన్న ప్లకార్డులే కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ వైపు వెళ్లే దారులన్నీ కేంద్ర ప్రభుత్వ వివక్షను నిలదీస్తూ రూపొందించిన హోర్డింగులతో గులాబీ రంగు పులుముకొన్నాయి. దీక్షా ప్రాంగణం చుట్టూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ‘ఛాయ్‌వాలా.. చావల్ లేలో’, ‘హం హక్ మాంగ్నే ఆయే.. భీక్ మాంగ్నే నహీ’, ‘మోదీ జీ.. యహా మత్ భూలో.. తెలంగాణ కిసాన్ భీ భారత్‌కే కిసానే హై’, ‘దేశ్‌కీ షాన్.. హమారీ కిసాన్’ వంటి నినాదాలతో ప్లకార్డులు, హోర్డింగులు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ‘బరిగీసి కొట్లాడుతాం.. గిరి గీసి ప్రశ్నిస్తం.. మా వడ్లు కొంటవా..? కొనవా..?’ ‘తెలంగాణ రైతుల తెగువను చూపిస్తాము.. నూకలు తినమన్నోల్ల తోక కత్తిరిస్తాము’ అంటూ ఉన్న పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి: వినోద్
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ, అప్పటివరకు ఉన్న ఆదాయాన్ని కూడా పోగొట్టిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల నుంచి పంట కొనకుండా ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ కాపాడుకొంటారని తెలిపారు. బీజేపీ నాయకులకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు సోమవారం హైదరాబాద్‌లో ధర్నా చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై మెలికలు పెట్టిన కేంద్రం మెడలు వంచాలంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. రైతుల జీవితాలను రాజకీయంగా వాడుకోవాలన్న ఉద్దేశంతోనే బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ధర్నా పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలుపై ఏనాడూ బీజేపీ నేతలు రైతులకు అండగా నిలువలేదని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలకు సోయి ఉంటే.. యాసంగిలో వరి సాగుచేయాలని రైతులను రెచ్చగొట్టిన బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇండ్ల ముందు ధర్నా చేయాలని సూచించారు.