సీఎం కేసీఆర్ సంకల్పం ఫలించింది. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన యాదాద్రి దివ్యక్షేత్రం సాక్షాత్కారించింది. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాదాద్రి పంచ నారసింహ కేత్రాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ఈ అలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ తొలిభక్తునిగా పూజలు జరిపించిన తర్వాత.. భక్తులకు నరసింహస్వామి నిజస్వరూప దర్శనభాగ్యం కల్పించారు.
యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సోమవారం ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపురరం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.
యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. సీఎం కేసీఆర్కు కంకణధారణ చేసి పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. రాజ గోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ నిర్వహించారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు నిర్వహించారు.
నవ్య యాదాద్రిని సీఎం కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
2016, అక్టోబర్ 11న విజయదశమి నాడు యాదాద్రీశుడి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆలయానికి వాడిన రాయి (కృష్ణశిల) రెండున్నర లక్షల టన్నులను గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల నుంచి సేకరించారు. ఆలయ పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు, 8 మంది గుత్తేదారులతో పాటు 1500 మంది కార్మికుల కష్టం ఉంది. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు 66 నెలల పాటు కొనసాగాయి. ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను శిల్పకారులు తయారు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను రూ. 2 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. యాదాద్రి ప్రధానాలయ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేశారు. దేశంలోనే ప్రథమంగా ఆలయమంతా కృష్ణశిలతో నిర్మించారు. గిరి ప్రదక్షిణకు కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల మేర వలయ రహదారి నిర్మించారు.