హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకద్రకు బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ దేవరక్రదతోపాటు నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభ ముగియాల్సి ఉండగా.. తన హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైంది.
ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరారు. అయితే హెలిక్యాప్టర్ బయలుదేరిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్ గుర్తించాడు. వెంటనే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే దాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు.
హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం కావడంతో ఇవాళ సీఎం తన పర్యటనను రద్దు చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, సీఎం పర్యటనను కొనసాగించేందుకే మొగ్గు చూపారు. దాంతో సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయంగా మరో హెలిక్యాప్టర్‌ను సిద్ధం చేశారు. దాంతో సీఎం దేవరకద్ర సభకు బయలుదేరారు.