హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. శ్రీలంక శరణార్థులకు నకిలీ నివాస ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు వంటివి సృష్టించి విదేశీ పాస్‌పోర్టులు ఇప్పిస్తున్నట్టు సమాచారం అందుకున్న సీఐడీ విభాగం.. శుక్రవారం హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
సోదాల్లో కొన్నేండ్లుగా హైదరాబాద్ నుంచి ఈ దందాను నడిపిస్తున్న ప్రధాన సూత్రధారి అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరి సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయినవారిలో తొమ్మిది మంది ఏజెంట్లు, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న చెన్నైకి చెందిన పాస్‌పోర్ట్ ఏజెంట్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు ఎస్బీ అధికారుల సాయంతో విదేశీ పౌరులకు పాస్‌పోర్టులు ఇప్పిస్తున్నట్టు విచారణలో అబ్దుస్ సత్తార్ అంగీకరించినట్టు సీఐడీ విభాగం ఏడీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల నుంచి 108 పాస్పోర్లులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 4 సీపీయూలు, 3 ప్రింటర్లు, 11 పెన్‌డ్రైవ్‌లు, ఒక సానర్, మానిటర్, పాస్ పోర్ట్ అప్లికేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గ్రాఫిక్ డిజైనింగ్‌లో ఆరితేరిన సత్తార్
ఈ కేసులో ఏ1గా ఉన్న అబ్దుస్ సత్తార్ గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ పనుల్లో ఆరితేరాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, జనన ధ్రువీకరణ పత్రాలు నకిలీవి సృష్టించడం ప్రారంభించాడు. ఆ తర్వాత పాస్‌పోర్టు పొందే విధానాన్ని తెలుసుకొని.. చెన్నైలోని ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో పరిచయం పెంచుకున్నాడు. అతడి ద్వారా శ్రీలంక శరణార్థులు, పౌరులతో పరిచయం పెంచుకొని, విదేశీ పౌరులకు భారతీయ పాస్‌పోర్టుకు అవసరమైన అన్ని పత్రాలను నకిలీవి తయారు చేసేవాడు.
తర్వాత ఏజెంట్ల ముఠాతో ఒక్కో పాస్‌పోర్టుకు రూ.75 వేలు వసూలు చేసేవాడు. నకిలీ ధ్రువపత్రాలు తయారుచేసిన తర్వాత వారి పేర్లపై స్లాట్లను నమోదు చేసేవాడు. అప్పటికే ఆయా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులను డబ్బుతో కొనేసిన అబ్దుస్ సత్తార్.. పోలీస్ వెరిఫికేషన్ సులువుగా అయ్యేలా ఓ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇలా ఇప్పటివరకు తన సహచరులతో కలిసి 100కు పైగా పాస్‌పోర్టులను ప్రాసెస్ చేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వీటిల్లో 92 పాస్‌పోర్టులు పొందిన వారు విదేశాలకు వెళ్లినట్టు తేలింది. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరచనున్నారు.