Telangana Cabinet | హైదరాబాద్, మార్చి7 (హైదరాబాద్ ) : సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై క్యాబినెట్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సచివాలయంలో ఆరు గంటలపాటు సాగిన క్యాబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంపు, రన్నింగ్ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయంపై ఎక్కువ సమయం చర్చ జరిగినట్టు సమాచారం. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా పూర్తిచేసే టలా ప్రాజెక్టుల భూసేకరణ, పనులకు రూ. 1,000 కోట్ల అంచనా వ్యయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు తెలిసింది. దీనిని క్యాబినెట్ ఆమోదించాలని అభ్యర్థించినట్టు సమాచారం. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా భగ్గుమన్నట్టు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు గత బడ్జెట్లో రూ.480 కోట్లు కేటాయించగా, మరో 26 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, నీటిపారుదల శాఖ టోకెన్లు జారీ చేసినా, ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇవ్వలేదని మంత్రి అన్నట్టు తెలిసింది.
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, ఇప్పటివరకు రూపాయి కూడా మంజూరు చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. గోదావరి బేసిన్లో చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.184 కోట్లు, మొడికుంటవాగు ప్రాజెక్టు పనుల పూ ర్తికి రూ.163 కోట్లు, చనాక-కొరాటా సహా లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులకు రూ.147 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.546 కోట్లు, దేవాదులకు రూ.512 కోట్లు, కృష్ణా బేసిన్లో కోయిల్‌సాగర్‌కు రూ.121 కోట్లు, భీమాకు రూ.127 కోట్లు, నెట్టెంపాడుకు రూ.67 కోట్లు, కల్వకర్తి ఎత్తిపోతలకు రూ.489 కోట్లు, డిండి ఎత్తిపోతలకు రూ.1,881 కోట్లు, ఎస్ఎల్బీసీ పనుల కోసం రూ.1,679 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు చేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇంతవరకు మోక్షమే లేదని నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తావించినట్టు తెలిసింది.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో ఓడిపోవడంపై గురువారం నిర్వహించిన క్యాబినెట్ భేటీలో వాడి వేడి చర్చ జరిగినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై ముఖ్యమంత్రి, మంత్రులు సుదీర్ఘంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిని కేవలం మూడు స్థానాల్లో ఓటమిగా భావించవద్దని, దాదాపు ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఓటమిగా చూడాలని సీనియర్ మంత్రులు సూచించినట్టు సమాచారం. ఈ లెకన రాష్ట్రంలో 70% జిల్లాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమైందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల నియోజకవర్గాల్లో ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా, ఓటర్లు విద్యావంతులు కావడంతో మన మాట నమ్మలేదని సీనియర్ మంత్రులు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వీళ్లు ఏ ఒక రంగానికో, ఏ ఒక సామాజిక వర్గానికో పరిమితం కాదని, అన్ని వర్గాల ప్రజల అసంతృప్తికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.