హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికీ బడ్జెట్లో కొర్రీలు పెట్టారు. మహాలక్ష్మి పథకంలో ఇస్తున్న జీరో టికెట్ల విలువ నెలకు రూ.400 కోట్లు కాగా.. ఏడాదికి రూ.4,800 కోట్లు అవసరం. అయితే, బడ్జెట్లో కేవలం రూ.3,084 కోట్లు అంటే నెలకు రూ.256 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి మరో రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పినా నెలకు మొత్తంగా రూ.340 కోట్లు మాత్రమే అవుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేదెవరని ఆర్టీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
వెంటనే బడ్జెట్ సవరించి ఆర్టీసీకి మొత్తం రూ.10 వేల కోట్లు కేటాయించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో బస్సులు పెంచామని, 6,400 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని ఏ ప్రాతిపదికన చెప్తున్నారో ఆర్థిక మంత్రి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల కాలంలో 3,500 మంది కార్మికులు రిటైర్ కాగా, ఒకరిని కూడా కొత్తగా నియమించలేదని వారు స్పష్టం చేశారు. విద్యుత్తు బస్సులు తీసుకొచ్చి, ఇప్పటికే ఉన్నవారినే ఇంటికి పంపే కేంద్ర ప్రభుత్వ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు.