Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు గందరగోళంగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.3-5వేల కోట్లు కేటాయిస్తేనే పాతబస్తీ మెట్రోతో పాటు రెండో దశ ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించేందుకు అవకాశం ఉన్నదని అధికారులు ముందు నుంచీ చెప్తూ వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి పాతబస్తీ మెట్రో పనులకు హడావుడిగా శంకుస్థాపన చేయటంతో ఆ మేరకే కేటాయింపులు ఉంటాయని అంతా ఆశించారు.
కానీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు, ఎయిర్పోర్టు మెట్రోకు రూ.100 కోట్లు, హెచ్ఎంఆర్ఎల్కు రూ.500 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.1100 కోట్లే కేటాయించారు. 78.4 కిలోమీటర్ల రెండో దశ మెట్రో ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,042 కోట్లు. దీంతో ఈ కేటాయింపు ఏమూలకు? అని అంతా పెదవి విరుస్తున్నారు. ఈ అరకొర కేటాయింపుతో అధికారులు పనులను ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉన్నందున మెట్రో ప్రాజెక్టుల పనులపై మరింత జాప్యం నెలకొనే అవకాశం ఉన్నది.