పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే పదే రాహుల్ భజనకూ లోటు లేదు. పరనింద ఆపలేదు. కానీ, పద్దు లెక్కల్లోనే తేడా కొట్టింది! సంక్షేమానికి కోతపెట్టింది! ఎన్నికల ముందరి హామీలు.. భట్టి పద్దులో వట్టి కోతలుగా, గట్టి వాతలుగా మిగిలినయ్. ప్రజాసంక్షేమానికి కేటాయింపులను కత్తిరించిన సర్కార్.. ఏపీ అప్పులను మాత్రం అడగకపోయినా మాఫీ చేయడం ఓ విచిత్రం. ఓ వైపరీత్యం!
కొత్త పథకం లేదు. కొత్త పాలసీ లేదు. మరోవైపు తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన పథకాలకు మంగళం! దళితుల పైసలకు దండి కొట్టారు! రైతుల సంక్షేమానికి గండికొట్టారు! పోనీ తాము గ్యారెంటీ ఇచ్చిన పథకాలకైనా నిధులిచ్చారా.. అంటే అదీ లేదు. కేంద్రం నుంచి రావాల్సిన మిషన్ కాకతీయ, భగీరథ గ్రాంట్ నిధుల క్లెయిమ్‌కు మంగళం పాడారు. అభివృద్ధికి మూలమైన క్యాపిటల్ వ్యయంలో భారీ కోతలు పెట్టారు. ఇరిగేషన్, పరిశ్రమలు, గృహనిర్మాణ, ప్లానింగ్, రోడ్ల అభివృద్ధి నిధులకు కత్తెర. మహిళలకు మొండిచెయ్యి. ఉద్యోగుల 4 విడతల డీఏ, పీఆర్సీ ఊసేలేదు. నిరుద్యోగులకు భృతి లేదు. కొత్త ఉద్యోగాల కల్పనకు పైసా ఇవ్వలేదు. దళితబంధును బంద్ పెట్టి, చేనేతకు ‘చెయ్యి’చ్చారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆక్రందనలు బడ్జెట్ లేఖకుల చెవిన పడలేదు. భూమ్యాకాశాలు బద్దలయ్యేంత ప్రచారం చేసిన ఇందిరమ్మ ఇండ్లకే అరకొర నిధులు. ఆర్టీసీ విలీనం ఊసులేదు. కౌలురైతు గురించి స్వయంగా భట్టిగారే చెప్పిన కథను కాకెత్తుకెళ్లింది. 31వేల కోట్లు అవసరమైన రుణమాఫీకి ఇచ్చింది 26వేల కోట్లు! రైతుబంధుకు 23వేల కోట్లకుగాను కేటాయించింది మూడోవంతు! వెరసి ఎన్నికల ముందు కూతలెత్తిన హామీలన్నీ బడ్జెట్లో కోతలైపోయాయి. భట్టి పద్దు ప్రజలకు వట్టి ముచ్చటగానే మిగిలింది!!
Telangana Budget | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ ఒక దిక్సూచి. ప్రభుత్వ లక్ష్యాలకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రతిబింబం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దశదిశ లేకుండా సాగింది. రూ.2,91,159 కోట్లతో ఆర్థికశాఖమంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది గత బడ్జెట్ కన్నా రూ.753 కోట్లు మాత్రమే ఎక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించుకున్న ప్రాధాన్య రంగాలకు కూడా ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేయలేకపోయింది. ఆత్మస్తుతి, పరనిందలతో అప్రస్తుతంగా సాగిన బడ్జెట్ ప్రసంగం మాదిరిగానే, కేటాయింపులు సైతం ఉన్నాయి.
అనేక రంగాలకు నిధుల్లో కోతలు విధించగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల ఊసే ఎత్తలేదు. రాజకీయ కారణాలతో దళితబంధు వంటి విప్లవాత్మక పథకాన్నే పక్కన పడేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా ఎగవేసింది. ఆరు గ్యారెంటీల కింద ఇచ్చిన 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఏడు నెలలు గడిచిన తర్వాత కూడా ఐదింటిని మాత్రమే అమలు చేస్తుండగా, మరో ఐదింటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు ఇచ్చిన గ్యారంటీని పూర్తిగా తుంగలో తొక్కింది. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీల అమలుకు ఎగనామం పెట్టింది. ఒక్క వ్యవసాయ రంగానికి మాత్రం నిధులు ఎక్కువగా కేటాయించింది.
తెలంగాణ రాష్ట్రం అంటేనే సంక్షేమానికి పెట్టింది పేరు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది మొదలు వినూత్న పథకాలతో ప్రత్యేక గుర్తింపును సాధించింది. ‘సంపద పెంచు.. పేదలకు పంచు’ అనే నినాదాన్ని అనుసరిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరిగిన కొద్దీ పేదలు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచింది. కానీ, తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పద్దుకు నిధులు తగ్గిపోయాయి. నిరుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి మొత్తంగా రూ.55,021.73 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.53,559.78 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే, రూ.1461.95 కోట్లు కోత విధించారు. బీసీలకు సంబంధించి ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు బడ్జెట్లో రూ.50 కోట్ల చొప్పున మాత్రమే ప్రభుత్వం కేటాయించింది.
ఎస్సీ కార్పొరేషన్‌ను మాదిగ, మాల కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయినప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో మాల కార్పొరేషన్ ఊసెత్తలేదు. ముఖ్యంగా ఎస్సీ సంక్షేమానికి ఏకంగా రూ.13,434 కోట్ల కోత విధించింది. ప్లానింగ్ విభాగంలో రూ.7,712 కోట్లు కోత పెట్టగా, నీటిపారుదల, గృహనిర్మాణ రంగాలకు తలా రూ.4 వేల కోట్లకుపైగా కోతలు పడ్డాయి. ఆర్అండ్బీ శాఖకు రూ.3 వేల కోట్లు తక్కువ కేటాయింపులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నీ కలుపుకొని దాదాపు 1047 గరుకులాలు ఉన్నాయి. వాటి నిర్వహణకు, వసతుల కల్పన, భవనాల నిర్మాణాలకు మాత్రం బడ్జెట్లో ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ సంక్షేమ హాస్టళ్లకు సైతం అదే తరహాలోనే బడ్జెట్లో అరకొరగా నిధులను కేటాయించింది.
కేసీఆర్ పేరుమీద తుపాకీ పెట్టి రేవంత్ సర్కార్ ప్రజాసంక్షేమాన్ని కాల్చి పారేసింది. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠను పెంచిన మానవీయ పథకాలకు నిర్దాక్షిణ్యంగా నిధులు కోసిపారేసింది. కడుపులో నలుసు పడ్డప్పటి నుంచి కన్నతండ్రిలా ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు కేసీఆర్ సర్కార్ అమలు ‘కేసీఆర్ కిట్’ను రేవంత్ సర్కార్ ఎత్తగొట్టింది. ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు, మగపిల్లాడు పుడితే రూ. 12వేలతోపాటు అందించే ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం దాదాపు రూ. 440 కోట్లు ఈ పథకానికి కేటాయించింది. 2024-25 బడ్జెట్లో మాత్రం కేవలం రూ. 165 కోట్లును ప్రతిపాదించారు. ఈ మొత్తం చెల్లించాల్సినవే తప్ప ఈ పథకానికి కేటాయించినవి కాదని బడ్జెట్ పద్దులను చూస్తే స్పష్టం అవుతున్నది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీల వరద పారించింది. డిక్లరేషన్లు, గ్యారెంటీలు, మ్యానిఫెస్టో పేరుతో ఇలా 420 హామీలు ఇచ్చింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గప్పాలు కొట్టింది. వాటిలో మొత్తం 13 హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఇందులో అమలు చేసింది కేవలం నాలుగింటినే. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపును అమలు చేస్తున్నది. మిగతావాటిలో రైతుభరోసా, కూలీలకు భరోసా, వరి పంటకు బోనస్, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇంటర్నేషనల్ స్కూల్ పథకాన్ని అమలు చేసేందుకు నిధులు కేటాయించింది. మహిళలకు ప్రతి నెల రూ. 2500, ఉద్యమకారులకు ఇంటి స్థలం, విద్యాభరోసా కార్డు, పెన్షన్ల పెంపు వంటివాటిని విస్మరించింది. మిగతా హామీల్లో అమలయ్యే వాటి కోసం బూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి.
నిరుద్యోగులకు నిరుద్యోగభృతి, ఆటో కార్మికులకు ఏటా ఆర్థిక సాయం వంటి తక్షణ అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్, బీసీ ఓవర్సీస్, అంబేద్కర్ ఓవర్సీస్ పథకాల కింద రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన నిధులను పెంచుతామని, ఎక్కువ మంది విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ప్రస్తుత బడ్జెట్లో గతేడాది లెక్కలనే వల్లె వేసింది. అంటే.. పెంచుతామన్న మాటను గాలికి వదిలేసింది. బడుగు బలహీనవర్గాలకు సంబంధించి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి బడ్జెట్లో సరిపడా నిధులను కేటాయించలేదు. దాదాపు రూ.7 వేల కోట్ల బకాయిలు ఉండగా, అందులో సగం నిధులను కూడా బడ్జెట్లో పొందుపరచకపోవడం గమనార్హం. వివిధ శాఖలకు చేసిన కేటాయింపులను పరిశీలిస్తే బడ్జెట్ మొత్తం గత బడ్జెట్ పద్దులకు ఒకటి, అరా కలిపి తయారు చేసినట్టుగా కనిపిస్తున్నది తప్ప, ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, వాటికి అనుగుణంగా తయారుచేసినట్టుగా లేకపోవడం గమనార్హం.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చింది’.. ఎన్నికల వేళ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పదే పదే చేస్తున్న ప్రచారం ఇది. సీఎం రేవంత్‌రెడ్డి సందర్భం వచ్చిన ప్రతిసారి ‘కడుపుకట్టుకొని అయినా ప్రతినెల ఒకటో తేదీన కిస్తీలు కడుతున్నాం’ అంటూ ఊదరగొడుతున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క అయితే అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. కానీ, బడ్జెట్ ప్రతిపాదనల్లో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. నిరుటి కన్నా ఈసారి ఒక రూపాయి ఎక్కువే అప్పు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ. 35,118 కోట్లు అప్పు చేసినట్టు స్వయంగా బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా రూ.57,112 కోట్ల రుణాలు సేకరించనున్నట్టు బడ్జెట్లో ప్రస్తావించారు. ఇది నిరుడు తీసుకున్న అప్పుల కన్నా రూ.7,494 కోట్లు ఎక్కువ. గతంలో అన్ని రకాల మార్గాల్లో ప్రభుత్వం తీసుకున్న అప్పుల కన్నా ఈ ఏడాది ఏకంగా రూ.12,661 కోట్లు ఎక్కువగా అప్పులు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘బంధు’లు బంద్
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు, బీసీబంధు, మైనారిటీబంధు పథకాలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించకపోయినా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.
గొర్రెల పంపిణీ పథకం అవుట్
కేసీఆర్ కులవృత్తులకు అత్యంత ప్రోత్సా హం అందించారు. గొల్లకురుమ సమాజానికి 75 శాతం సబ్సిడీతో గొర్రెల పెంపకం పథకాన్ని అమలు చేశారు. ఆ పథకాన్ని రేవంత్ సర్కార్ నిలిపివేసింది.
‘ప్రగతి’కి బ్రేక్
పట్టణ ప్రగతి, పల్లెప్రగతి పథకాలు తెలంగాణ సర్కార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కాంతులీనాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులన్నీ రాష్ర్టానికే వచ్చాయి. అటువంటి పథకాలకు రేవంత్ సర్కార్ నిధులను నిలిపివేసింది.
అడవికి చీకటి
మారుమూల ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంట్ కోసం బడ్జెట్లో సర్కార్ నిధులకు కోత విధించింది. కేసీఆర్ సర్కార్ త్రీఫేజ్ కరెంట్ కోసం బడ్జెట్లో రూ. 60 కోట్లు కేటాయిస్తే రేవంత్ సర్కార్ ఇందుకోసం రూ. 12.25 కోట్లు మాత్రమే కేటాయించింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో భూఅభివృద్ధి కోసం కేసీఆర్ రూ.150 కోట్లు కేటాయిస్తే రేవంత్ సర్కార్ కేటాయించింది కేవలం రూ. 37.50 కోట్లే. అలాగే తండాల్లో బీటీ రోడ్ల కోసం కేసీఆర్ సర్కార్ రూ. 252 కోట్లు కేటాయిస్తే తాజా బడ్జెట్లో అందుకోసం 150 కోట్లనే ప్రతిపాదించారు. గిరిపుత్రులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేసీఆర్ సర్కార్ సీఎంఎస్టీఈ పథకాన్ని (చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆంత్రప్రెన్యూనర్షిప్) ప్రారంభించారు. కేసీఆర్ సర్కార్ ఈ పథకానికి రూ. 50 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ. 12.5 కోట్లను మాత్రమే కేటాయించారు. ఆ మొత్తం గత లబ్ధిదారులకు అందించాల్సిన సబ్సిడీ మాత్రమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.