హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంక్షేమ పరిషత్ నుంచి ఆర్థిక సహాయం అందుతుందనే నమ్మకంతో అప్పులు చేసి వ్యాపారాలు ప్రారంభించినవారు, వివిధ మార్గాల ద్వారా రుణాలు పొంది ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లినవారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. పథకాలకు ఎంపికైన వారే కాకుండా వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు కూడా తమకు సంక్షేమ పరిషత్ పథకాలు వస్తాయా? రావా? అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అమలుచేస్తున్న పథకాల్లో పేద బ్రాహ్మణులకు ఆర్థికంగా చేయుత అందించి వారిని వివిధ వృత్తి, వ్యాపారాల్లో నిలదొక్కుకునేలా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన బ్రాహ్మిణ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ(బెస్ట్), పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యకోసం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన వివేకానంద విదేశీ విద్యానిధి పథకం ముఖ్యమైనవి. బెస్ట్ పథకం కింద గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వగా సుమారు 3,000 దరఖాస్తులొచ్చాయి. వీరిలో 700 మందికి ఇంటర్యూలు, క్షేత్రస్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. వివేకానంద విదేశీ విద్యానిధి పథకం కోసం దాదాపు 1,000 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 400 మందిని ఎంపికచేశారు.
ఎంపికైనవారికి ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందనే నమ్మకంతో విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారులు వివిధచోట్ల అప్పులుచేసి విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. బెస్ట్ స్కీమ్‌కు ఎంపికైన 700 మంది లబ్ధిదారులు సైతం వివిధ మార్గాల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని వ్యాపారాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ప్రభుత్వం నుంచి నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ సంక్షేమ పరిషత్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. కనీసం రూ.50 కోట్లు విడుదల చేస్తే ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఇతర పథకాలకూ నిలిచిన నిధుల విడుదల
గత కేసీఆర్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.230 కోట్లు ఖర్చుచేసింది. బెస్ట్, విదేశీ విద్యానిధి పథకంతోపాటు వేద/శాస్త్ర పండితులకు గౌరవవేతనం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, సంప్రదాయ వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం, పేద విద్యార్థుల కోసం రామానుజ ఫీ రీ యింబర్స్‌మెంట్ తదితర పథకాలను అమలుచేసింది. ఆయా పథకాలకు కూడా గత మూడు నెలలుగా నిధులు విడుదల కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిషత్తు భవిష్యత్ అయోమయంలో పడింది. గత పాలకమండలి రద్దుకాగా, పాలనాధికారి సైతం మంత్రి శ్రీధర్‌బాబు పేషీ అధికారిగా చేరారు. దీంతో బ్రాహ్మణ పరిషత్తు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం నిధులు విడుదలచేసి సంక్షేమ పరిషత్‌ను ఆదుకోవాలని వివిధ బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి.