హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ చేపట్టనున్న రథయాత్ర షెడ్యూల్‌పై ఊగిసలాట నెలకొన్నది. వచ్చే నెల 5 నుంచి రథయాత్రలు ప్రారంభించాలని గతంలో ఆ పార్టీ నేతలు భావించారు. బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాలతో దానిని 10వ తేదీకి మార్చారు. జనగాంలో రథయాత్ర ప్రారంభించాలని, 19వ తేదీ వరకు కొనసాగించాలని తొలుత భావించారు.
ఈ నెల 16, 17, 18 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు బీజేపీ అదిష్ఠానం ప్రకటించింది. ఆ సమావేశాలకు రాష్ట్ర నాయకత్వంతోపాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది నేతలు తరలివెళ్లాల్సి ఉంటుంది. అనుకున్న ప్రకారం ఒకవేళ రథయాత్ర చేపట్టినా మధ్యలో మళ్లీ 3 రోజులు విరామం ఇవ్వాల్సి వస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు మథన పడుతున్నారు. దీంతో గతంలో ప్రకటించిన విధంగా 5 నుం చే రథయాత్రను ప్రారంభించాలని, బడ్జెట్ సమావేశాలకు ఎంపీలకు మినహాయింపు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. లేదా 10 నుంచి ప్రారంభించి జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి మినహాయింపు కోరాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఈ అంశంపై ఢిల్లీ అధిష్ఠానంతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భావిస్తున్నారు.