అలంపూర్ : కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్త యాత్రికుల కోసం అవసరమైన వసతి గృహాలు ఏర్పాటు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం వాటిని ఉపయోగంలోకి తేవడానికి కూడా చేతకావడం లేదని బీజేపీ ధ్వజమెత్తింది. ప్రజాపాలనపై ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
బుధవారం బీజేపీ నాయకులు రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా సుమారు రూ.37 కోట్ల నిధులతో నిర్మించిన యాత్రికుల వసతిగృహ భవన సముదాయాన్ని సందర్శించి మాట్లాడారు. భవనం నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగంలోకి తేలేకపోతుందని విమర్శించారు. అన్నం వండి వడ్డించినా కూడా తినలేని దీనస్థితిలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు.
రాష్ట్ర దేవాదాయశాఖ కోరిక మేరకు ప్రసాద్ స్కీమ్ భవన సముదాయంలో అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి లక్షల విలువైన గదుల సముదాయాన్ని, భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్నశాలను అప్పగించినా వాటిని నేటికి వాడుకోలేకపోతున్నారని ఆరోపించారు. యాత్రికల కోసం కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన ప్రసాద్ స్కీమ్ భవనాన్ని ఉపయోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు.
అలాగే అలంపూర్ చౌరస్తాలో సుమారు 25 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన 100 పడకల దవఖానను ప్రభుత్వం నేటి వరకు వినియోగంలోకి తేలేదన్నారు. ప్రజలకు నిత్యం ఓపి సౌకర్యం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, సంబంధిత శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులు స్పందించి దవఖానను వినియోగంలోకి తేవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గుర్తుచేశారు.
అందుబాటులోకి తేకపోతే దవఖాన భవన సముదాయం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకొని కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజగోపాల్, రాజశేఖర్, శర్మ, ఈశ్వరయ్య, రంగస్వామి, మహేష్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.