రాష్ట్రంలో పండుగైన వ్యవసాయం మళ్లీ విధ్వంసం కావాల్నా? పంటపంటకూ వచ్చే రైతుబంధు సాయం ఆగిపోవాల్నా? పండించిన పంటను కొనేవాళ్లు లేక మార్కెట్లలో తెగనమ్ముకోవాల్నా? ఎరువులు, విత్తనాల కోసం మళ్లా పోలీస్టేషన్ల ముందు క్యూ కట్టాల్నా? లాఠీదెబ్బలు తినాల్నా? భూ పంచాయితీలతో ఎవుసం పడావుపెట్టి కోర్టుల చుట్టూ తిరగాల్నా?.. కాంగ్రెస్ చెప్తున్నట్టుగా ధరణిని రద్దు చేస్తే ఇవే మళ్లీ మనముందుకొస్తాయి. భయంకరమైన పాత రోజులు మళ్లీ వస్తాయి. వ్యవసాయం ధ్వంసమై.. రైతుకు కానికాలం దాపురిస్తుంది.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ధరణిని రద్దు చేస్తే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూతపడతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మళ్లీ గతంలో మాదిరిగానే రైతులు ధాన్యాన్ని, ఇతర పంటలను అమ్ముకొనేందుకు వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దళారుల దయాదాక్షిణ్యాలపైనే రైతు బతుకు ఆధారపడి ఉంటుంది. మద్దతు ధర దొరకదు. వ్యాపారులు చెప్పిందే ధర. ఇచ్చినవే పైసలు. ధరణిని రద్దు చేస్తే పంటల కొనుగోళ్లకు ఇబ్బంది ఎందుకొస్తుందనే సందేహం రావొచ్చు. వ్యవసాయ, భూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి భూమి, రైతు వివరాలను ధరణిలో నిక్షిప్తం చేశారు. ఏ రైతు, ఎంత విస్తీర్ణంలో, ఏ పంటలు వేశారనే అంశాన్ని వ్యవసాయ శాఖ సర్వే చేసి ఆ వివరాలను ధరణితో లింకు చేసింది. రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా దీనికి అనుసంధానం చేసింది. ఈ వివరాల ఆధారంగానే ధాన్యం కొనుగోలు పోర్టల్‌ను సిద్ధం చేశారు. దీని ప్రకారం ఎంత ధాన్యం వస్తుంది? కొనుగోలుకు ఎన్ని నిధులు అవసరమవుతాయి? వంటి లెక్కలు వేసుకొని కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఒక్క ధరణిని రద్దు చేస్తే భూముల వివరాలు ఉండవు. రైతుల వివరాలు ఉండవు. పంటల వివరాలు ఉండవు. వివరాలే లేనప్పుడు ప్రభుత్వం ఏవిధంగా పంటలను కొనుగోలు చేస్తుంది? రైతులకు ఏవిధంగా డబ్బులు చెల్లిస్తుంది? అందుకే ఒక్క ధరణిని రద్దు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పంటల కొనుగోలు మొత్తం బంద్ అయితది. అదే జరిగితే అన్నదాత మళ్లీ రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు రావొద్దని ఏ రైతు అయినా కోరుకుంటారా? కానీ కాంగ్రెస్ కోరుకుంటున్నది. రైతులకు రైతుబంధు రాకుండా కుట్రలు చేస్తున్నది. పెట్టుబడి సాయం పంపిణీ మూలాలపైనే దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నది. అందుకే ధరణిని రద్దు చేయాలని చూస్తున్నది. కాంగ్రెస్ చెప్పినట్టుగా ధరణిని రద్దు చేస్తే.. ఆ మరుక్షణమే రైతుబంధు బంద్ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు కారణం రైతుబంధు పంపిణీ కోసం రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ధరణి నుంచే తీసుకుంటున్నది. రైతుబంధు పంపిణీకి నెల ముందు వరకు ధరణిలో నిక్షిప్తమైన భూముల క్రయ, విక్రయాల ఆధారంగా రైతుల సంఖ్య, భూమి సంఖ్యను లెక్కిస్తున్నది. దాని ప్రకారమే రైతుబంధుకు ఎన్ని నిధులు కావాలో అంచనాకు వస్తున్నది. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మంది రైతులు, 1.56 కోట్ల ఎకరాల భూములకు రూ.7,500 కోట్ల వరకు రైతుబంధు పంపిణీ చేస్తున్నది. ఇంత భారీ సంఖ్యలో రైతులకు, భారీ మొత్తాన్ని ఏ అవకతవకలు లేకుండా చేయడం ధరణితోనే సాధ్యమైంది. మరి ధరణిని రద్దు చేస్తే రైతుల వివరాలను, భూముల వివరాలను ఎక్కడి నుంచి తీసుకుంటారు?. ఈ వివరాలేవీ ఉండవు కాబట్టి రైతుబంధు ఇవ్వలేం అంటూ కాంగ్రెస్ చేతులెత్తేస్తుంది. రైతుబంధుతోపాటు రైతుబీమాకు చరమగీతం పాడుతుంది. రైతుల వివరాలే లేనప్పుడు రైతుబీమా అమలు ఏవిధంగా సాధ్యమవుతుంది? ఒకవేళ సాధ్యమైనా సవాలక్ష కొర్రీలతో దాన్ని పొందడం గగనమవుతుంది. డెత్ సర్టిఫికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
ఒకప్పుడు ఎరువులు, విత్తనాలకోసం ఎలాంటి ఇబ్బంది ఉండేదో ప్రతి రైతుకూ అనుభవమే. ఎర్రటి ఎండల్లో పోలీస్స్టేషన్ల ముందు చెప్పులు క్యూలైన్లలో పెట్టి రోజుల తరబడి వేచి చూసిన సందర్భాలు కోకొల్లలు. ఒక్క ఎరువుల లారీ లోడ్ వస్తే.. ఒక్క బస్తా దక్కించుకునేందు కు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క బస్తా దక్కాలంటే.. పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సిందే. కానీ ఇప్పుడు పోలీస్స్టేషన్ల ముందు క్యూలైన్లు లేవు. రైతులపై పోలీసుల లాఠీలు విరగడం లేదు. ఇందుకు కార ణం ధరణి. ధరణి పోర్టల్‌లో రైతుల వివరాలు, భూ విస్తీర్ణం వివరాలతోపాటు పంట విస్తీర్ణం వివరాలను కూడా అధికారులు పొందుపరుస్తారు. ఏ జిల్లాలో, ఏ పంట, ఎంత విస్తీర్ణంలో వేశారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం ఎంత మొత్తంలో ఎరువులు కావాలో ప్రభుత్వం అంచనా వేసి సిద్ధం చేస్తున్నది. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని పంపిణీ చేస్తున్నది. 2014లో కేవలం 25 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే పంపిణీ చేశారు. ఆ మాత్రానికే నానా ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం 40 లక్షల టన్నులకు పెరిగింది. అయినా ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా రావడం లేదు. ఇందుకు కారణం ధరణి. ఒకవేళ ధరణినే రద్దు చేస్తే.. రైతుల వివరాలు, పంటల వివరాలు ఉండవు. ఎన్ని ఎరువులు కావాలో తెలియదు. దీంతో మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడి, ఎరువులు, విత్తనాల కొరత వస్తుంది. మళ్లీ పోలీస్స్టేషన్లలో పెట్టి అమ్మే దుస్థితి దాపురిస్తుంది. మళ్లీ రైతుల వీపులపై పోలీసుల లాఠీలు విరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
ఉమ్మడిరాష్ట్రంలో ఎకరాలకు ఎకరాల భూమి ఉన్న రైతులు సైతం ‘అన్నమో రామచంద్రా’ అంటూ వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది. లక్షల మంది ఇతర రాష్ర్టాలకు, దేశాలకు వలస వెళ్లారు. ఇప్పుడు ఆలాంటి భయంకర పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయ విస్తీర్ణం భారీగా పెరిగింది. 2014లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.30 కోట్ల ఎకరాలు ఉండగా ఇప్పుడు 2.3 కోట్ల ఎకరాలకు చేరింది. వరి సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాల నుంచి 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. కరువు జిల్లాలుగా పేరున్న మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో సైతం వ్యవసాయ విస్తీర్ణం భారీగా పెరిగింది. తద్వారా వలసలు బంద్ అయ్యాయి. రైతులంతా తిరిగి వచ్చి ఆత్మగౌరవంతో సొంత పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. ధరణి తీసేస్తే ఇవన్నీ తలకిందులవుతాయి. భూములకు లెక్కపత్రం ఉండదు. ఎవరి భూమి ఎవరి పేరుపై ఉన్నదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో రైతుల మధ్య భూ తగాదాలు, గెట్ల పంచాయితీలు పెరిగిపోతాయి. ఈ పంచాయితీలతో పోలీస్ స్టేషన్లు, కోర్టులచుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గొడవలతో రైతులు పొలాలను వదిలేసి ఎవుసాన్ని పడావు పెట్టేసి మళ్లీ వలసలు వెళ్లే దుస్థితి ఏర్పడుతుంది.
రాష్ట్రం ఏర్పడినప్పుడు అంతా గందరగోళం. వ్యవసాయం ఆగమాగం.. భూ రికార్డులు అస్తవ్యస్థం. రైతుల వివరాలు లేవు. ఏ భూమి ఏ రైతుదో తెలువదు. ఏ ప్రాంతంలో ఎంతమంది రైతులున్నరో, అక్కడ ఏం పంటలు పండుతాయో వివరాల్లేవు. నిత్యం రైతుల మధ్య గెట్టు పంచాయితీలు, భూ తగాదాలే. ఈ పంచాయితీల పుణ్యమా అని రైతులు ఎవుసాన్ని పడావుపెట్టి కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగేవారు. రైతుల సమస్యలన్నింటినీ దగ్గర నుంచి చూసిన సీఎం కేసీఆర్.. ఒక్క ధరణి అనే బ్రహ్మాస్త్రంతో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపారు. ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి వ్యవసాయ, భూ సంస్కరణలకు నాంది పలికారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా భూముల వివరాలను, రైతుల వివరాలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ధరణిలోని వివరాల ఆధారంగానే వ్యవసాయ సంస్కరణలను రూపొందించారు. వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్, పంటల కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల సరఫరా చేయాలంటేనే ఆగమాగమయ్యేవారు. ఇప్పుడు పంటల విస్తీర్ణం 2.3కోట్ల ఎకరాలకు పెరిగినా, ఎరువుల పంపిణీ 40 లక్షల టన్నులకు చేరినా, ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.50 కోట్ల టన్నులకు ఎగబాకినా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రావడం లేదు. ధరణిలోని భూములు, రైతుల వివరాల ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా పక్కాగా ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. ఇదంతా ఒక్క ధరణితోనే సాధ్యమవుతున్నది. ఈ విధంగా వ్యవసాయరంగాన్ని ఎంతగానో బలోపేతం చేసి రైతుల గోస తీర్చిన ధరణిని రద్దు చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. అందుకే రైతులు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ వస్తే మళ్లీ బతుకులు ఆగం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.