హైదరాబాద్, నవంబర్26 (నమస్తే తెలంగాణ): బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బీసీ కమిషన్ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలు, కమిషన్ కార్యాలయంలో చేపట్టిన బహిరంగ విచారణ మంగళవారం ముగిసినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. బహిరంగ విచారణలో వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల నుంచి మొత్తం 1336 వినతులు స్వీకరించినట్టు తెలిపారు.
బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలని చాలా సంఘాలు విన్నవించాయని, వాటిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. విచారణలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ రంగు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు, స్పెషల్ ఆఫీసర్ సతీష్‌కుమార్, తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నిర్వహించిన బహిరంగ విచారణ తీరుపై కులసంఘాలు తీవ్ర అసహనం వ్యక్తంచేశాయి. బహిరంగ విచారణలో పాల్గొని తమ కులాల స్థితిగతులను వివరించేందుకు, బీసీ స్థితిగతులపై వినతులు సమర్పించి, సూచనలు చేసేచేందుకు మంగళవారం కమిషన్ కార్యాలయానికి వివిధ కుల సంఘాల ప్రతినిధులు, వ్యక్తులు తరలివచ్చారు.
గ్రూపులవారీగా, వ్యక్తిగతంగా, సంఘాల తరపున సూచనలు చేశారు. వీటిపై చైర్మన్ నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారంటూ కులసంఘాల నేతలు మండిపడుతున్నారు. కేవలం వినతిపత్రాలు మాత్రమే ఇవ్వాలంటూ తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే అవకాశమివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటప్పుడు విచారణ ఎందుకు చేపట్టడమని ప్రశ్నించారు. ఇదేవిషయంపై ఏకంగా చైర్మన్ నిరంజన్తోనే పలు సంఘాల నేతలు వాగ్వాదానికి దిగడం గమనార్హం.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటింటి సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు సేకరించిన 20,86,707 నివాసాల సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరించారు. రాష్ట్రంలో మొత్తం 1,17,89,076 నివాసాలను గుర్తించగా మంగళవారం నాటికి 1,10,18,102 నివాసాల సర్వే పూర్తి చేశారు. 16 జిల్లాలో 100 శాతం పూర్తికాగా, మరో 13 జిల్లాలో కొనసాగుతున్నది. డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్లు కలిసి సర్వే వివరాలను నమోదు చేస్తున్నారు.