Caste Survey | హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): పాతబస్తీలోని పలు ఇండ్లలో సర్వే సక్రమంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. దూద్‌బౌలి, ఉమ్డాబజార్, ఉస్మాన్‌బాగ్ తదితర కాలనీల్లో దాదాపు 200 ఇండ్లను తాము పరిశీలించామని, వాటిలో దాదాపు 60 నుంచి 70 ఇండ్ల వరకు సర్వే కాలేదని తెలిపారు. చాలావరకు ఎన్యుమరేటర్లు స్టికర్లు అతికించి వెళ్లిపోయారు తప్ప వివరాలను నమోదు చేయలేదని వెల్లడించారు.
వెంటనే ఆయా ఇండ్ల వివరాలను నమోదు చేయాలని సంబంధిత అధికారులను చైర్మన్ ఆదేశించారు. కులగణన రీసర్వేపై అవగాహన కల్పించేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పాతబస్తీలోని వివిధ కాలనీల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రీసర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరగాలని ఆదేశించామని తెలిపారు.
టోల్‌ఫ్రీ నంబర్ 040-21111111కు ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు స్వయంగా వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. చైర్మన్ వెంట కన్నయ్యలాల్, పులిపాటి రాజేశ్‌కుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆశన్న, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పుష్పఠాకూర్, డీపీవో యాదగిరి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కమిషన్ సభ్యులు సైతం పలుచోట్ల పర్యటించారు. నేడు కూడా కమిషన్ చైర్మన్, సభ్యుల పర్యటన కొనసాగనున్నది.