అప్పటివరకు ఉద్యమం: బార్ కౌన్సిల్ సభ్యుడు మోహన్‌రావు
తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 10: రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లు పూర్తికావస్తున్నా విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడు తూ.. ప్రధాని ప్రజాస్వామ్య బద్ధంగా చట్టసభలలో మాట్లాడాలని హితవుపలికారు. 2000 సంవత్సరంలో మూడు రాష్ర్టాలను ఏర్పాటుచేసినప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమ పార్టీతో కలిసి రావాలని సూచించారు. మోదీ వ్యాఖ్యలను ఉపసంహరించుకొనే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కల్యాణ్‌రావు, న్యాయవాదులు కే గోవర్ధన్‌రెడ్డి, వై రవికుమార్, పీ గోవర్ధనరెడ్డి, రాజేశ్వరరావు, అబ్దుల్ ఖబీర్, విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
జీర్ణించుకోలేకే: పిడమర్తి రవి
ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ గన్‌పార్కులో మాదిగ ఐకాస అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ.. తెలంగాణకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును మోదీ జీర్జించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పాల్గొన్నారు.