Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్‌పై సంతకం చేశారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కాగా, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పార్టీ అధినేత , పార్టీ శాసన సభానేత కేసీఆర్‌ను కోరడం, వారు సమ్మతించటం మరోవైపు ఎంఐఎం నేత పార్టీ సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.