హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సౌకర్యం కోసం సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన సభను ఆదివారం ఉదయం 9 గంటలకే ప్రారంభించేలా మార్పుచేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం కూడా సభను నడపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. కాగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి కేరళలోని అలెప్పీలో జరిగే పుస్తకావిష్కరణ సభకు వెళ్లాల్సి ఉన్నది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సంకటంలో పడ్డారు. ఇటు అసెంబ్లీలో పీసీ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టేందుకు సర్కారు ముహూర్తం ఖరారుచేసింది. మరోవైపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సౌకర్యం కోసం అసెంబ్లీ ప్రారంభ సమయాన్ని ఉదయం 9గంటలకు మార్చినట్టు తెలిసింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత సీఎం అసెంబ్లీలో ప్రసంగించి అక్కడి నుంచి నేరుగా కేరళ వెళ్లిపోతారని సమాచారం. ఇందుకోసం శాసనసభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కూడా ఎత్తేసినట్టు చర్చ నడుస్తున్నది.