హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశ, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల కేటాయింపు, గొర్రెల యూనిట్ల పంపిణీ, జనపనార మిల్లుల ఏర్పాటు, నూతన జిల్లాల్లో సమగ్ర కలెక్టరేట్ భవన సముదాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం జీరో అవర్ కొనసాగింది.
విరామం అనంతరం ప్రారంభమైన సభలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.