తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నది..రాష్ట్ర బిజినెస్ పాలసీలు బాగున్నాయి. భవిష్యత్తు పెట్టుబడుల్లో తెలంగాణకు ప్రాధాన్యమిస్తాం.
– సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ ఎండీ
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు అని, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో రాష్ర్టానికి కీలక స్థానం కల్పిస్తామని టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు. తెలంగాణలోని వివిధ రంగాల్లో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. గురువారం ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం-బాంబే హౌస్‌లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టాటా గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపై చంద్రశేఖరన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్మాట్లాడుతూ.. ప్రగతిశీల విధానాలతో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను వివరించారు. ఆయా రంగాలవారీగా టాటా గ్రూప్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను వివరించి, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలో తెలంగాణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రశేఖరన్‌కు విన్నవించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని ప్రశంసిస్తూ, టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో ముందుకు పోతున్న టాటా గ్రూప్‌నకు తెలంగాణ అనుకూలమని వెల్లడించారు. విమానయాన రంగంలో భాగంగా హైదరాబాద్‌లో ఒక ఎమ్మార్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్)కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
జేఎస్‌డబ్ల్యూ ఎండీతో భేటీ
మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఆ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జిందాల్‌ను కోరారు. తెలంగాణ ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, అకడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సెయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పకనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అకడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నదని వివరించారు. జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

హెచ్‌యూఎల్ ఎండీతో చర్చలు
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని తెలిపారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పామాయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఆర్పీజీ (రామా ప్రసాద్ గోయెంకా) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకాతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.

తెలంగాణ ప్రగతి భేష్: జిందాల్
జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసించారు. మంత్రి కేటీఆర్‌తో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదని చెప్పారు. కొన్నేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. తమ సంస్థ భవిష్యత్తు పెట్టుబడుల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తామని జిందాల్ హామీ ఇచ్చారు.
స్వామి వివేకానందకు కేటీఆర్ నివాళి
ప్రముఖ సంఘ సంస్కర్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. వివేకానంద గొప్ప తత్వవేత్త, ఆలోచనాపరుడని, ఆయన ఆదర్శాలు, ఉదాత్తమైన బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశ యువతకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
పారిశ్రామిక దిగ్గజాలతో బిజీబిజీగా కేటీఆర్
ప్రపంచ పారిశ్రామికరంగంలో పరిచయం అవసరం లేని దిగ్గజ పారిశ్రామికవేత్తలు వాళ్లు.. నిత్యం సమావేశాలు, వ్యాపార కార్యకలాపాల్లో క్షణం తీరిక లేని షెడ్యూల్.. వేల కోట్ల రూపాయల టర్నోవర్ వాళ్ల కంపెనీల సొంతం.. వాళ్లు అడిగితే దేశ ప్రధాని అపాయింట్మెంట్ కూడా వెంటనే లభిస్తుంది. వాళ్లే.. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, ఆర్పీజీ (రామా ప్రసాద్ గోయెంకా) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా. అటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో గురువారం మంత్రి కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరటం గమనార్హం.
దేశ దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
ఫార్ములా రేస్ కార్యక్రమం కోసం ముం బై వెళ్లిన కేటీఆర్ బిజీగా గడిపారు. సమయాన్ని వృథా చేయకుండా రాష్ర్టాభివృద్ధిలో దేశ పారిశ్రామిక దిగ్గజాలను భాగస్వాముల ను చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వేళ, మన దేశ దిగ్గజ బహుళజాతి సంస్థలు సైతం ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పడుతున్న తపనను అర్థం చేసుకొన్న ఈ దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మంత్రి కేటీఆర్‌కు సమయం కేటాయించి రాష్ట్ర పారిశ్రామిక రంగ అభివృద్ధిని ప్రశంసించటం విశేషం. తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చొరవను వారు ప్రత్యేకంగా అభినందించారు.