Telangana | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు రాష్ర్టాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో కూడిన త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండోదశలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో పరిష్కారం కాని సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
విభజన సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాలరావు, సీఎస్ శాంతికుమారి, మరో ఇద్దరు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, సీఎస్ నీరబ్‌కుమార్, మరో ఇద్దరు సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర పాల్గొన్నారు. 6.10 గంటలకు ప్రారంభమైన ముఖ్యమంత్రుల సమావేశం 8 గంటల వరకు (సుమారు రెండు గంటలు) జరిగింది. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో అనేక విభజన అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
మొదటి సమావేశంలోనే పరిష్కారం రాదు: భట్టి
ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా పదేండ్లుగా పరిషారానికి నోచుకోని అంశాలను త్వరగా చర్చించుకొని ముందుకుపోవాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించినట్టు మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. విభజన చట్టంలోని సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిషారం దొరుకుతుందని తాము భావించలేదని తెలిపారు. సమస్యల పరిషారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, రెండు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రెండు రాష్ర్టాల విభజన సమస్యల పరిషారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో కూడిన ఇరు రాష్ట్రాల నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రెండు వారాల్లో ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిషార మార్గాలు చూస్తారని వెల్లడించారు. ఉన్నత స్థాయి అధికారులు పరిషారం చూపలేని అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ కసరత్తు చేసి పరిషార మార్గాలు కనుగొంటుందని చెప్పారు. మంత్రుల స్థాయిలో పరిషారం కనుగొన్న సమస్యలకు సీఎంలు ఆమోదం తెలుపుతారని అన్నారు. ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో పరిషారం కాని సమస్యలకు ఇరు రాష్ట్రాల సీఎంలు పరిషార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు భట్టి తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణకు సమన్వయ బృందాలు
విభజన సమస్యలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు భట్టి వివరించారు. యాంటినారోటిక్ అంశంపై తెలంగాణ అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని చెప్పారు. సైబర్ క్రైమ్ సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఈ రెండు అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని, డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌ను నియంత్రించాలని నిర్ణయించామని వివరించారు. ఈ మహమ్మారుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలను కాపాడుకునేందుకు.. అడిషనల్ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటు చేసుకొని.. సమన్వయంతో పని చేసుకుని వీటిని నియంత్రించాలని నిర్ణయించినట్టు వివరించారు.
తెలుగు జాతి ఆనందించే రోజు: ఏపీ మంత్రి సత్యప్రసాద్
విభజన అంశాల పరిష్కారానికి రెండు రాష్ర్టాల సీఎంలు ఒకచోట చర్చించటం తెలుగు జాతి ఆనందించే మంచి రోజు అని ఏపీ మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. సమావేశంలో అందరి సలహాలు, సూచనలు తీసుకొని, అన్ని అంశాలపై లోతుగా చర్చించామని తెలిపారు. అనేక పోరాటాలతో నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో తెలంగాణ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఎవరి సెంటిమెంట్లు, మనోభావాలు దెబ్బతినకుండా, అందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
వచ్చే రోజుల్లో అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ, సీఎంల భేటీలు మరిన్ని జరుగుతాయని తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ర్టాలుగా మార్చాలనే ఉద్దేశంతో ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఏపీలో స్కూల్ బ్యాగుల్లో గంజాయి దొరికే పరిస్థితి దాపురించిందని చెప్పారు. ఏపీలో గంజాయి ఉత్పత్తి అయి హైదరాబాద్‌కు వస్తున్నదని, తెలుగు జాతిని కాపాడే లక్ష్యంగా సమిష్టి నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. రెండు వారాల్లో సీఎంలు హర్షించేలా మంచి విధానాలు జరుగుతాయని చెప్పారు. తెలుగు ప్రజలు హర్షించేలా కార్యచరణ ఉండబోతున్నదన్నారు.
చంద్రబాబుకు రెడ్‌కార్పెట్ స్వాగతం
తొలుత ప్రజాభవన్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబుకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. సీఎంతోపాటు భట్టి, పొన్నం, శ్రీధర్‌బాబు ఏపీ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డి శాలువాతో సన్మానించి కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు అందజేశారు. అలాగే చంద్రబాబు సీఎం రేవంత్తోపాటుతోపాటు డిప్యూటీ సీఎం భట్టిని శాలువాలతో సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. తిరుమల ప్రసాదాన్ని అందజేశారు. భేటీ అనంతరం ప్రజాభవన్‌లో విందు ఏర్పాటుచేశారు.