Job Calendar | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ), ఉస్మానియా యూనివర్సిటీ/కరీంనగర్ కమాన్‌చౌరస్తా/యాదగిరిగుట్ట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఓ బోగస్ అని బీఆర్ఎస్వీ నాయకులు, నిరుద్యోగులు మండిపడ్డారు. దానిని జాబ్‌లెస్ క్యాలెండర్‌గా అభివర్ణించారు. రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ మరోసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌పై శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, బీఆర్ఎస్వీ నాయకులు నిరసనలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాల ఎదుట, యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, సిద్దిపేట కేంద్ర గ్రంథాలయంలో నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మిర్యాలగూడలో నిరసనకారులను పోలీసులు అడ్డుకొనేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొన్నది. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను రెచ్చగొట్టి, వాళ్లతో ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన రాహుల్‌గాంధీ తక్షణమే తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో పరీక్ష నిర్వహించే తేదీలు, అర్హతలు తప్ప మరేమీ లేదన్నారు. ప్రభుత్వం క్యాలెండర్లో పొందుపరిచిన వివరాలతో నిరుద్యోగులకు ఏం లాభం చేకూరుతుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను తమ రాజకీయాలకు బలి చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు.
కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా క్యాలెండర్ విడుదల చేసినట్టుందని అనుమానం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో సరైన వివరాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేకుంటే విద్యార్థి విభాగం తరఫున సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, కరీంనగర్లో బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ యువజన విభాగం ప్రతినిధులు వొడ్నాల రాజు, నారదాసు వసంతరావు, బొంకూరి మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యాదగిరిగుట్టలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ కో-కన్వీనర్ ఒగ్గు మల్లేశ్, అడ్డగూడూరులో బీఆర్ఎస్వీ తుంగతుర్తి నియోజకవర్గ కార్యదర్శి బాలెంల అరవింద్, పట్టణాధ్యక్షుడు గూడెపు నరేశ్, మిర్యాలగూడలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్, సిద్దిపేటలో బీఆర్ఎస్వీ నాయకులు మేరుగు మహేశ్, యాదగిరి, సాయిచరణ్‌గౌడ్, రమేశ్, లక్ష్మణ్, నాయకులు, నిరుద్యోగులు నిరసనలో పాల్గొన్నారు.