నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 17 : తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పొల్చుతూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహించింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నిరసన ర్యాలీతీశారు. అనంతరం బంజారాహిల్స్ చౌరస్తాలో తేజస్వీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘బీజేపీ డౌన్ డౌన్.. తేజస్వీ ఖబడ్దార్.. వాడెవ్వడు వీడెవ్వడు- తెలంగాణకు అడ్డెవ్వడు.. జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ అంటే బీజేపీకి మొదటి నుంచీ గిట్టదని ధ్వజమెత్తారు. కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పోరాట ఫలం, వేలాదిమంది అమరుల బలి దానాలతో ఆవిర్భవించిన తెలంగాణపై తేజస్వీ సూర్య విషం చిమ్మారని మండిపడ్డారు. తేజస్వీ వెంటనే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్టీయూ నేత రాంబాబుయాదవ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. తేజస్వీకి తెలంగాణ పోరాటం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ‘ఖబడ్దార్ తేజస్వీ సూర్య’, ‘బీజేపీ డౌన్‌డౌన్’ అంటూ నినదించారు. అనంతరం తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్‌చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదాంబ సెంటర్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దురహంకారపూరితమైనవిగా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేసేలా ఉన్నాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పేర్కొన్నారు. తేజస్వీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా వర్ని పోలీసుస్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అవివేకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్, భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి దేశ అత్యున్నత పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం.. అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమన్నారు. మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ ఏర్పాటుపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై దాడి చేస్తున్నదని నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సింగిరెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు తీరుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 14 ఏండ్లపాటు ఉద్యమాన్ని నడిపి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిటిష్‌వారు చేసిన దేశ విభజన, పాకిస్థాన్ ఏర్పాటుతో తెలంగాణను పోల్చుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. గతంలో ఏపీకి చెందిన లోకసభ సభ్యుడు కృష్ణదేవరాయలు కూడా ఏపీ విభజన సందర్భాన్ని ఉద్దేశించి.. బ్లాక్‌డే అంటూ వ్యాఖ్యానించారని, అప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారని ఎంపీ రవిచంద్ర గుర్తుచేశారు. తేజస్వీ సూర్య అభ్యంతర వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు-2023లోనే చట్టంగా మారిందని, దానిని 2024 ఎన్నికల్లో అమలుపరిస్తే బాగుండేదని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలో 14 ఏండ్ల పోరాటం, అమరుల బలిదానంతో అరవై ఏండ్ల స్వరాష్ట్ర కల సాకార మైందని గుర్తుచేశారు. తెలంగాణపై ఏ మాత్రం అవగాహన లేని తేజస్వీ పార్లమెంట్ సాక్షిగా అడ్డదిడ్డంగా మాట్లాడడం సిగ్గుచేటని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అభ్యంతరం చెప్పాల్సిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చోద్యం చూడడం శోచనీయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తేజస్వీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట అని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వేలాదిమంది అమరుల బలిదానం పునాదుల మీద, దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడిందని ఆమె గుర్తుచేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. నాడు పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రం ఇచ్చారని ప్రధాని నరేంద్రమోదీ అంటే, నేడు ఒక ఎంపీ ఏకంగా దేశ విభజనతో పోల్చడం సిగ్గుచేటన్నారు.
తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యదర్శి కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడిన తేజస్వీ సూర్య వెంటనే బేషరుతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వంపై బీజేపీకి ఉన్న వ్యతిరేకత ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి బయట పడిందని మండిపడ్డారు.
పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఎంతో మంది జైలు పాలు, ఎందరో యువకులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కించపరిచే విధంగా పాకిస్తాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ నేత ఉపేంద్రాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా, ఎంపీగా ఉన్నందుకు బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు మాట్లాడితే బీజేపీ ఎంపీలలో ఒక్కరూ మాట్లాడక పోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రాబోయే రోజులలో తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎక్కడికక్కడే అడ్డుకోవాలి అని ఈ సందర్బంగా ఆయన ఉద్యమ కారులకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13ఏండ్లు కావస్తున్నా బీజేపీ నాయకులకు తెలంగాణపై అక్కసు తగ్గలేదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆరోపించారు. ఈ మేరక శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ అడ్డగోలుగా మాట్లాడుతుంటే రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు పక్కనే మౌనంగా కూర్చోవడం ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే రాష్ట్ర ప్రజలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను రోడ్లపై తిరగనివ్వబోమని బాలు హెచ్చరించారు.
హనుమకొండ, ఏప్రిల్ 17: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు మండిపడ్డారు. బ్రిటిష్‌వారు భారతదేశాన్ని విభజించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని, ప్రజల త్యాగాలు, బలిదానాలను తేజస్వీ సూర్య అవహేళన చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలోనూ లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అస్తిత్వంపై జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు, ఏపీ టీడీపీ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని తెలంగాణ సమాలోచన కేంద్రం (టాస్క్) కన్వీనర్ ఎర్రోజు శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టాస్క్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వేదికంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు గతంలో ప్రధాని, కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే చూడాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును సహించలేకపోతున్న వారి వైఖరిని టాస్క్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్న పార్టీలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జీ వెంకటేశ్వర్లు, హెచ్ రవీందర్, ముల్కా సురేశ్, ఎస్వీసీ ప్రకాశ్, ప్రభాకర్, బొడిగ శ్రీనివాస్, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.