ఎల్లారెడ్డి రూరల్, మార్చి 23 : వరుస బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారి గుండెపోటుతో మృతిచెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలలో బాన్సువాడ ఆర్టీవో కార్యాలయంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్(59)ని ఎల్లారెడ్డి ఆర్డీవో ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఈ నెల 24న విధుల్లో చేరాల్సి ఉండగా 22న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. విజయ్‌కుమార్ స్వగ్రామం ఆర్మూర్. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు.
భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసేందుకు అవకాశమున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏడాదిన్నరలో ఐదుసార్లు బదిలీ చేశారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా నిర్మల్ జిల్లాకు బదిలీ చేయడంతో పాటు, మళ్లీ రూల్స్‌కు విరుద్ధంగా ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. స్పౌస్ కోటాలో నిజామాబాద్‌కు బదిలీకి ప్రయత్నం చేయగా అతడి విజ్ఞప్తిని పట్టించుకోకుండా కామారెడ్డికి బదిలీ చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపినా కామారెడ్డి జిల్లాలో మూడు సార్లు బదిలీ చేశారు. తరచూ బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన విజయ్‌కుమార్‌కు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో దవాఖానకు తరలించగా.. శనివారం అర్ధరాత్రి మృతిచెందారు.