Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందూ ఓ యువతి మృతిచెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని శనివారం రాత్రి యువతి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఇందు(17) కడుపు నొప్పితో శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. శనివారం రాత్రి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. అయితే సర్జరీ కోసం తీసుకెళ్లి.. కాసేపటికి వచ్చి యువతి మృతిచెందినట్లుగా వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళనపై సమాచారం అందుకున్న గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే యువతి మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి, ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహాన్ని తిరిగి గద్వాల ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువులు నిరసన కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.