హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. వర్షాల వల్ల కొన్నిచోట్ల ఈవీఎంల తరలింపులో ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండ్లపై ఈవీఎంలను సిబ్బంది తరలించారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 13.2 శాతం నమోదుకాగా, నల్లగొండ లోక్సభ పరిధిలో 12.88 శాతం, భువనగిరి పార్లమెంట్ పరిధిలో 10.54 శాతం, నిజామాబాద్ 10.9 శాతం, ఖమ్మం 12.24 శాతం, జహీరాబాద్లో 12.8 శాతం చొప్పున పోలింగ్ నమోదయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు,106 నియోజకవర్గాల్లో సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3.32 కోట్లమంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.