Government Schools | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడులను కుదిస్తే బరిగీసి కొట్లాడుతామని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. 27వేల బడులను 4వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై టీచర్లు ఫైర్ అవుతున్నారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉండి సీఎం మాట్లాడటంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
సర్కార్ బడులను కుదించడం ద్వారా ఊరి బడులకు ప్రభుత్వం ఉరి బిగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశాయి. పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నదని మండిపడ్డాయి. 23వేల సర్కార్ స్కూళ్లను మూసివేస్తే పేద, బడుగు బలహీనవర్గాలకు ఉచిత విద్య దూరమవుతుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాయడంలో భాగంగా స్కూ ళ్లను మూసివేయబోతున్నారని ఆందోళన వ్య క్తంచేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని సర్కార్ ఉపసంహరించుకోవాలని, లేదంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని టీచర్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రేషనలైజేషన్ పేరిట రద్దుచేస్తే.. విద్యాపరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని, ఈ ఉద్యమానికి.. టీచర్ల ఆగ్రహానికి కాంగ్రెస్ సర్కార్ గురికావాల్సి వస్తుందని హెచ్చరికలు జారీచేస్తున్నాయి.
ఇరువై వేల బడులను నాలుగు వేలకు కుదిస్తే తండాలు, గ్రామాల్లో స్కూళ్లు మూతబడుతాయి. నాలుగైదు గ్రామాలకో స్కూల్ అవుతుంది. ఇది విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టు. విద్యాకమిషన్ సిఫార్సులపై అందరితో చర్చించాల్సింది పోయి.. ఆయా సిఫార్సులను అమలు చేయడం అత్యంత దారుణం. పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి.
-మట్టపల్లి రాధాకృష్ణ, టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలోని 27వేల సర్కార్ బడులను 4వేలకు కుదిస్తామనడం అత్యంత దారుణం. ఇది విద్యావ్యతిరేక విధానం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి పంచాయతీకో పాఠశాల.. మూతబడ్డ స్కూళ్లను తెరిపిస్తాం.. సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయబోమన్న సీఎం నోటి నుంచి 4వేలకు కుదిస్తామన్న మాటలు చూసి అవాక్కయ్యాం. పాఠశాలలను మూసివేస్తే మరో పోరాటానికి దిగుతాం.
– ఎన్ తిరుపతి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకుంటా.. నేనే విద్యాశాఖ మంత్రిని అని సీఎం వ్యాఖ్యానిస్తే ఏదో మంచి జరుగుతుందని ఆశించాం. విద్యావ్యవస్థ ప్రక్షాళన అవుతుందనుకున్నాం. కానీ సర్కార్ బడులను మూసివేసేందుకేనని మేం అర్థం చేసుకోలేకపోయాం. బడులను నిర్వీర్యం చేసేందుకే విద్యాశాఖను సీఎం తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు. ఒక్క స్కూల్ మూసివేయబోమన్న సీఎం ఇప్పుడు తిరోగమన విధానం ప్రకటించడం గర్హనీయం. బడుల కుదింపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
-లింగారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలోని స్కూళ్లను నాలుగు వేలకు కుదించడం విద్యాహక్కు చట్టానికి పూర్తి విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలను కుదిస్తామని సీఎం వ్యాఖ్యానించడం అత్యంత దారుణం. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని టీచర్లుగా మేం జీర్ణించుకోలేకపోతున్నాం. పేదలకు విద్యను అందించే బడులను నిర్వీర్యం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
– సయ్యద్ షౌకత్ అలీ, ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు