హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రంలో టీచర్ల్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) ఈ నెల 23న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు యూఎస్పీఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చావ రవి తెలిపారు. సోమవారం దోమల్‌గూడలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ, తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు.
15 రోజుల్లో డీఏలు విడుదల చేస్తామని, నెలరోజుల్లో పెండింగ్ బిల్లులు, ఆరు నెలల్లో పీఆర్సీ, హెల్త్కార్డులిస్తామని, సీపీఎస్‌ను రద్దుచేస్తామని ఎన్నికలప్పుడు హామీలిచ్చి అన్నింటిని విస్మరించిందని ఆరోపించారు. జీపీఎఫ్ సహా ఏ బిల్లులు విడుదల చేయకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు దయనీయ పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసం కోల్పోయిందని, విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆరోపించారు. కార్యకర్తలు, కాంట్రాక్ట్‌ల కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.
విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టకరమని ఉపాధ్యాయ సంఘం నేత కే రమేశ్ వాపోయారు. సమస్యలు చెప్పుకుందామంటే, వినతిపత్రాలు ఇద్దామంటే ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎన్ తిరుపతి, ఎం సోమయ్య, టీ లింగారెడ్డి, కే రమేశ్, ఎస్ హరికిషన్, వై విజయ్‌కుమార్, పీ మాణిక్‌రెడ్డి, ఏ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.