హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘టెట్’ గండం నుంచి గట్టెక్కుదామని పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాలం కలిసిరావడంలేదు. స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. అత్యంత కీలకమైన టెట్ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో అడ్డంకి వచ్చింది. మరోవైపు, పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. వీటన్నింటికీ మించి టెట్ పాస్‌కావడం ఉపాధ్యాయులకు ప్రధాన సమస్యగా మారింది. టెట్ పరీక్షలు సమీపిస్తుండటం.. సన్నద్ధమయ్యేందుకు సమయం లేకపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టెట్‌పై ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం టీచర్లంతా రెండేండ్లలోపు టెట్ పాస్‌కావాల్సిందే. ఐదేండ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే టెట్ నుంచి మినహాయింపు ఉన్నది. ఈ ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్నవాళ్లు ప్రమోషన్ పొందాలంటే మళ్లీ టెట్ పాస్‌కావడం తప్పనిసరి. టెట్ పాస్‌కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తున్నది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి మూడు నుంచి టెట్ పరీక్షలున్నాయి. ఈసారి ఇన్‌సర్వీస్ టీచర్లను కూడా టె ట్ రాసేందుకు అనుమతించగా, టీచర్ల నుంచే 71వేలకుగా దరఖాస్తులొచ్చాయి. సర్కారీ స్కూళ్లతోపాటు మాడల్ స్కూల్, గురుకుల టీచర్లు, కేజీబీవీ బోధనా సిబ్బంది టెట్ కోసం దరఖాస్తు చేశారు. డీఈఎల్‌డీతోపాటు బీఈడీ అర్హతతో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైనవారు పే పర్-1 పరీక్ష.. భాషాపండితులు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు పేపర్-2 రాయాల్సి ఉన్నది. దీంతో సీరియస్‌గా టెట్ ప్రిపేర్ అవుదామని టీచర్లంతా పుస్తకాలు ముందేసుకున్నారు. ఈ తరుణంలో ఎన్నికల డ్యూటీలు వేయడంతో ఈ ప్రయత్నాలన్నీ బూడిదిలో పోసిన పన్నీరయ్యాయి.

రెండేండ్లలో టెట్ పాస్‌కావాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. రెండేండ్లు అంటే ఉన్నదే 730 రోజులు. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఉన్న సమయంలోనే టెట్ పాస్‌కావాలి. ఈ టెట్‌ను మినహాయిస్తే జూన్ లేదా జూలైలో మరో టెట్ నిర్వహించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఏదో ఒక ఎన్నికలు ఉండనున్నాయి. మళ్లీ ఎన్నికలొస్తే మళ్లీ కథ మొదటికొచ్చినట్టే. ఎన్నికలు మినహాయిస్తే జూన్‌లో బడిబాట, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మూల్యాంకనం రూపంలో మరో అడ్డంకి ఎదురుకానున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ పేర్కొన్నారు. రెండేండ్లల్లో టెట్ లేకపోతే ఉద్యోగమే కోల్పోయే గండం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు పంచాయతీ ఎన్నికలు రావడంతో టెట్‌కు సన్నద్ధమయ్యే తీరిక టీచర్లకు దొరకడం లేదని వాపోయారు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజీస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ కోరారు. పోలింగ్ తేదీ 11,14,17 తేదీల్లో పరీక్షలు ఉన్నాయని, వీటిని వాయిదా వే యాలని కోరుతూ ఎన్నికల సంఘం సీఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఆయా తేదీల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సెలవులు ప్రకటించాలని వినతిపత్రం సమర్పించారు.
