Telangana | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది. ఏప్రిల్ 2, 3 తేదీల్లో టీచర్లకు ఏఐపై శిక్షణ ఇవ్వనున్నది. రాష్ట్రంలో 1-5 తరగతుల్లో ఏఐని బోధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గణితంలో ఏఐ పాఠాలను అంతర్భాగం చేయనున్నది.
పాఠ్యపుస్తకాలను స్వల్పంగా మారుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 513 పాఠశాలల్లో పైలట్ పద్ధతిలో ఏఐ బోధనను ప్రవేశపెట్టారు. 2025-26 విద్యాసంవత్సరంవరకు దశలవారీగా అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఏప్రిల్ 2న వర్చువల్, ఏప్రిల్ 3న టీచర్లకు వ్యక్తిగత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. పాఠశాల విద్యలో ఏఐని ప్రవేశపెట్టడంలో కలెక్టర్లు భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు.