హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యాకమిషన్ నివేదక, సిఫార్సులపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, విద్యారంగ నిపుణులు ఇలా అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ సూచనలు, సిఫారసులను అంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
కమిషన్ విడుదల చేసిన నివేదికతో విద్యా‘వార్’కు దారితీస్తున్నది. విద్యా కమిషన్ వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. విద్యాకమిషన్ పేరెత్తితేనే టీచర్లు, సంఘాలు భగ్గుమంటున్నాయి. కొందరైతే పిచ్చి తుగ్గక్ చర్యగా అభివర్ణిస్తున్నారు. మరికొందరైతే పరిధి దాటి వ్యవహరించారని, విద్యాకమిషన్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యాకమిషన్ నివేదిక, సిఫారసులు చెత్తబుట్టలో వేసేందుకు కూడా పనికిరావని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం(జీజేఎల్ఏ), ఇంటర్ విద్య జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎప్‌సెట్ రద్దు, ఇంటర్‌బోర్డు విలీనం, 12వ తరగతిలో పరీక్షలు పెట్టాలనడం, ఉత్తీర్ణతాశాతాన్ని 34 నుంచి 40శాతానికి పెంచాలనడం పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. వీటిని ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగం మేలుకోరి కాకుండా, తన వ్యక్తిగత అభిప్రాయాలను నివేదిక రూపంలో తీసుకొచ్చారని మండిపడ్డారు. ఏపీలోఆకునూరి మురళిని నమ్మి వైఎస్ జగన్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయాన్ని సీఎం రేవంత్ విస్మరించొద్దని సూచించారు.
తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక అశాస్త్రీయంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్(టీఎస్టీయూ) అభిప్రాయపడింది. ఈ నివేదికను ప్రభుత్వం తిరస్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, పాఠశాలలను మూసివేసే దిశగా సిఫార్సులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన కమిషన్, కొత్త సమస్యలు సృష్టిస్తున్నదని అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యాకమిషన్‌ను రద్దుచేసి, విద్యారంగంలో అపారమైన అనుభవం గల వారిచే విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని కోరారు.
టీచర్ల ఉద్యోగోన్నతులకు కొలమానాలేంటీ.. ఇదెక్కడి విధానం అని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ) ప్రశ్నించింది. విద్యాకమిషన్ నివేదిక అమలు సాధ్యంకాదని, ఒకవేళ అమలుచేస్తే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరిట పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడులకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. వేతనాలపై ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీచర్ల వేతనాలపై విద్యాకమిషన్ నోరుపారేసుకోవడం గర్హనీయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం(ఎస్‌ఎల్‌టీఏ) వ్యాఖ్యానించింది. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని అనడం సంకుచిత స్వభావానికి అద్దం పడుతున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.