హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వెంటనే 35 శాతం లాభాల వాటా ప్రకటించాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నా బోనస్ ఇవ్వడంలో జాప్యమెందుకని ప్రశ్నించారు. శుక్రవారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. ‘కాంగ్రెస్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.. లాభాల్లో వాటా ప్రకటించాలి..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అడగకుండానే సింగరేణి కార్మికులకు హక్కులను కల్పించి, గౌరవించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. 2023-24లో సింగరేణి వాస్తవ లాభాల్లో కేవలం 16 శాతం వాటా ఇచ్చి మోసం చేసిందని నిప్పులు చెరిగారు. అభివృద్ధి పేరిట రూ.2289 కోట్లు పక్కనబెట్టిందని ఆరోపించారు. ఇప్పటివరకు ఆ నిధుల ఖర్చుల వివరాలు వెల్లడించలేదని మండిపడ్డారు.
నాడు సింగరేణి కార్మికుల ఓట్లు దండుకొనేందుకు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు విస్మరిస్తున్నదని ధ్వజమెత్తారు. 2024-25 సంవత్సరంలో సంస్థ గణనీయంగా లాభాలు సాధించినందున.. వెంటనే 35 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందని, మూతపడే ప్రమాదమున్నదని చెప్తూ కాంగ్రెస్ సర్కార్ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నదని విమర్శించారు. చేతగాని విధానాలతోనే బొగ్గుగని కార్మికుల ఉసురు తీస్తున్నదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శులు కాపు కృష్ణ, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పర్లపల్లి రవి, కుసన వీరభద్రం, మంగీలాల్, అన్వేష్, బండి రమేశ్, నాగలి సాంబయ్య, బడితెల సమ్మయ్య, గడప రాజయ్య, వెంకటేశ్వర్లు, సంపత్, అవినాశ్, పొగాకు రమేశ్, సత్తయ్య, లక్ష్మణ్, రాజేశం, శేషగిరి, వాసర్ల జోసెఫ్, ఉప్పులేటి పర్వతాలు, జనగామ మల్లేశ్, అప్సర్‌పాషా, పుప్పాల రవీందర్, అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీకి వినతి
సింగరేణి కార్యాలయం ముట్టడి సందర్భంగా కొప్పుల ఆధ్వర్యంలో సీఎండీకి వినతిపత్రం అందజేశారు. లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని, కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయించాలని, అలవెన్స్‌లపై ఆదాయ పన్నును యాజమాన్యమే భరించాలని, మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులను వెంటనే అన్‌ఫిట్ చేయాలని, వేలంతో సంబంధంలేకుండా సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని తదితర డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.