హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పేద పిల్లల కోసం గురుకులాలను ఏర్పాటు చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిరంతరాయంగా కొనసాగించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ 30నెలల పాలనలో అధ్వానస్థితికి చేర్చారని ధ్వజమెత్తారు. ఈ మూడేండ్ల పాలనలో ఒక్క గురుకులాన్ని నిర్మించని సర్కార్.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట కాలం వెల్లదీస్తున్నదని దుయ్యబట్టారు. జీవో నం.9 ముసుగులో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
30 నెలల కాంగ్రెస్ పాలనలో 30వేల జాబ్‌లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ కండ్లు తెరిచి జీవో నంబర్9ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుందని హెచ్చరించారు. జీవో నం.9ని ఉపంసహరించుకొనే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు.