హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కారు (Congress Govt) చేస్తున్నదంతా డ్రామాయేనన్న విషయం బట్టబయలైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం తలసాని ఆధ్వర్యంలో బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ నెల 18న నిర్వహించే బీసీ బంద్‌కు మద్దతు, సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కొర్పొరేషన్ చైర్మన్లు, ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో వీ శ్రీనివాసగౌడ్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు డ్రామా చేయాలని చూసిందని చెప్పారు. ఈ విషయం గురించి అసెంబ్లీలో తాము ముందే చెప్పామన్న విషయాన్ని గుర్తుచేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్‌కు వెళ్లక ముందే ఢిల్లీలో ధర్నా చేసి డ్రామా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చితేనే 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందని తేల్చి చెప్పారు.
పార్టీలపరంగా రిజర్వేషన్ల పేరిట ఎన్నికలకు వెళ్తామంటే బీఆర్ఎస్ ఒప్పుకోబోదని స్పష్టం చేశారు. ఆ మేరకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయని తేల్చిచెప్పారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త బీసీ బంద్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ బంద్‌లో ప్రతి బీసీ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ బంద్‌లో పాల్గొనేందుకు తామంతా తెలంగాణ భవన్ నుంచి బయలు దేరుతామని వెల్లడించారు.
తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ మంత్రి వి శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. చట్టబద్ధతే లేని బీసీ రిజర్వేషన్ల కోసం కోర్టులు తీర్పులు ఎలా చెప్తాయని ప్రశ్నించారు. ఈ విషయంలో గత 17 నెలలుగా రేవంత్‌రెడ్డి సర్కారు నిద్రపోయిందని విమర్శించారు. జీవో వల్ల రిజర్వేషన్లు అమలుకావనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్ సర్కార్ తెలుసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్ మొదటి నుంచి ఇదే స్టాండ్‌పై ఉన్నదని, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నట్టు చెప్పారు.
రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, దాస్యం వినయ్‌భాస్కర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజ్యాదవ్, బీఆర్ఎస్ నేతలు ఆంజనేయగౌడ్, క్యామ మల్లేశ్, సుమిత్రా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.