హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నది. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కేంద్ర బిందువు, బీఆర్ఎస్ సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ నుంచే బీసీ ఉద్యమ శంఖారావం పూరించనున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేతృత్వంలో హైదరాబాద్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో పార్టీకి చెందిన కీలక బీసీ నేతలతో ఇటీవల భేటీ జరిగింది. రిజర్వేషన్ల అంశంపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై ఈ భేటీలో లోతుగా చర్చించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మరోసారి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మాజీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, జాజుల సురేందర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీసీ నేతలు క్యామ మల్లేశ్, జూలూరి గౌరీశంకర్ బాలరాజు యాదవ్, ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్, రాకేశ్, కిశోర్‌గౌడ్, రాజారాంయాదవ్, ఉపేంద్ర, సుమిత్రాఆనంద్, మఠం భిక్షపతి, శుభప్రద్‌పటేల్, రాఘవ, సుర్వి యాదయ్యగౌడ్, ఇతర బీసీ మేధావులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన బీసీ ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు చేశారు.
స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు విశ్రమించవద్దని బీఆర్ఎస్ నేతల భేటీలో తీర్మానించారు. ఈ మేరకు బీసీల్లో చైతన్యం తేవడంతోపాటు కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు. ఆగస్టు 8న కరీంనగర్లో బీసీల శంఖారావం మహాసభ, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు రెండోవారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని నిర్ణయించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది వేసిన ‘తెలంగాణ సింహగర్జన’ను కరీంనగర్ వేదికగా నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ప్రారంభించారు.
ఆనాడు పూరించిన సమర శంఖం ఢిల్లీ వరకు ప్రతిధ్వనించి లక్ష్యాన్ని ముద్దాడింది. ఇక్కడి నుంచి తలపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతమై తీరుతుందని నమ్మకం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నది. 14 ఏండ్ల ఉద్యమ చరిత, 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన పథకాల అంకురార్పణ ఇక్కడి నుంచే మొదలు కావడం విశేషం. కరీంనగర్ నుంచి పూరించే బీసీల శంఖారావం కూడా సత్ఫలితాలను ఇస్తుందని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరో పోరాటానికి కేసీఆర్ నేతృత్వంలో కదం తొక్కాలని భావిస్తున్నారు.
బీసీల్లో చైతన్యం నింపడంతోపాటు స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీకి గుణపాఠం చెప్పడానికి బీసీల సభా వేదికలను యుద్ధ అస్ర్తాలుగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. బీసీల రిజర్వేషన్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దాటవేత ధోరణిని ఎండగట్టాలని భావించింది. ఇందుకోసం ఆగస్టు రెండో వారంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
‘ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ‘కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 125 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఆ పార్టీకి రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది అన్న విషయం తెలియదా? అంటే తెలిసే ఇలా కపటనీతిని ప్రదర్శిస్తున్నది. బీసీల ఓట్లను దండుకోవడానికి నాడు అలా చెప్పింది’ అని కాంగ్రెస్ సర్కార్‌పై బీసీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తోపాటు బీసీ సంఘాలు, ఇతర వర్గాల నుంచి సర్కార్‌పై ముప్పేట దాడి ఎదురైంది.
ఊపిరి సలపని అధికార పక్షం.. దానిని తప్పించుకోవడానికి అసెంబ్లీలో బిల్లుపెట్టి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపింది. ఢిల్లీలో పెండింగ్‌లో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్డినెన్స్ అనే కొత్త డ్రామాకు తెరలేపింది. సుప్రీంకోర్టులో నిలవదని తెలిసినా గవర్నర్‌కు పంపింది. మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో నాలుగు రోజులు ధర్నా చేయాలని హస్తం పార్టీ మరో కొత్త నాటకానికి తెరతీసింది. బీసీల రిజర్వేషన్ అంశంలో తమ తప్పేమీ లేదని కేంద్రంపై నెపం నెట్టేందుకు ప్లాన్ వేసింది.
కురవి, జూలై 29 : ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుంచి బీసీలను మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఆర్డినెన్స్ డ్రామా ఆడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 1018 గురుకులాలు నెలకొల్పారని గుర్తుచేశారు. నేడు గురుకులాల నిర్వహణను పట్టించుకునేవారు లేక అనాథలుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం సొంత జిల్లాలోనే గురుకులంలో ఫుడ్ పాయిజన్ కావడాన్ని బట్టి ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ అంశంపై బీజేపీ కోర్టులో బాల్ ఉందని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవసరమైతే బిల్లు కోసం ఢిల్లీకి బీసీ నాయకులను రైళ్లల్లో తీసుకెళ్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. బీజేపీ చేతుల్లో ఉన్న బీసీ డిక్లరేషన్ స్థానిక ఎన్నికల కోసం ముందు పెడతారా అని ప్రశ్నించారు.