42% బీసీ కోటా అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో మాట ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పి జీవో-46 తెచ్చి బీసీలను దగా చేసింది. చట్టబద్ధంగా కాకుండా రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామనడం కాంగ్రెస్ మోసానికి నిదర్శనం. పార్లమెంట్లో బిల్లు, ఆర్డినెన్స్‌లు, జీవోల పేర్లు చెప్పి.. ఇంతవరకు అమలు చేసినదేంది?
-మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఒప్పుకునేది లేదు. సర్కారు మొండిగా వెళ్తే బీఆర్ఎస్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా బీసీ పోరుకు వెనుకాడం. తెలంగాణ ఉద్యమ తరహాలో రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం చేపట్టి తీరుతం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై కార్యాచరణకు సిద్ధమవుతామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, కామారెడ్డి డిక్లరేషన్‌లో మాట ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆ మాట తప్పి 46జీవో తెచ్చి బీసీలను మరోసారి దగా చేశారని విమర్శించారు. చట్టబద్ధంగా కాకుండా రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామనడం కాంగ్రెస్ అవివేకమని పేర్కొన్నారు.
పార్లమెంట్లో బిల్లు, ఆర్డినెన్స్‌లు, జీవోల పేర్లు చెప్పి, రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తికావస్తున్నా ఇంత వరకు ఎందుకు అమలు చేయడం లేదు? అని నిలదీశారు. కేంద్రం ఇచ్చే నిధుల కన్నా, బీసీలకు ఆత్మగౌరవమే ముఖ్యమని స్పష్టంచేశారు. బీసీ బిల్లు కోసం అని ఆర్భాటంగా ఢిల్లీలో ధర్నా చేస్తే, దానికి కాంగ్రెస్ అగ్రనేతలైన ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలే రాలేదని విమర్శించారు. ఆ తర్వాత ఆదరాబాదరాగా తీసుకొచ్చిన జీవో చెల్లదని తామంటే, ఆ బిల్లును తామే వ్యతిరేకిస్తున్నట్టు ఆనాడు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు డ్రామాలాడారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% బీసీ రిజర్వేషన్‌తోపాటు అనేక హామీలు ఉన్నాయని తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్, ఎంబీసీల మంత్రిత్వ శాఖ, రూ.1 లక్ష కోట్లు నిధులు, మండలానికి ఒక నవోదయ స్కూల్, చేతివృత్తులకు సాయం తదితర హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
బీసీలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ దాసోజు
బీసీలకు కాంగ్రెస్ సర్కారు చేసిన తప్పులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. జీవో46 తీసుకొచ్చి బీసీలకు కనీసం 23 శాతం కూడా రిజర్వేషన్లు రాకుండా చేసిన కాంగ్రెస్ సర్కారు.. తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బీసీలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ చెప్పిన సర్కారు.. తీరా 23కు తక్కువ చేసి కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఏనాడైనా.. రాష్ట్రపతిని గానీ, ప్రధానమంత్రిని గానీ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కలిశారా? అని సూటిగా ప్రశ్నించారు. బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు సీఎం రేవంత్రెడడి కనీస ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. ఏమీ చేయక ముందే కొన్ని పెయిడ్ బ్యాచ్‌లతో పూలమాలలు వేయించుకుని, క్షీరాభిషేకం చేయించుకున్నారని ధ్వజమెత్తారు. జీవో 46లో ఎస్సీ, ఎస్టీలకు 2011, బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమేమిటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు- బీసీల మధ్య చిచ్చుపెట్టి, వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు రేవంత్‌రెడ్డి అంటూ నిలదీశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, రాజారామ్ యాదవ్, ఆనంద్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల వారీగా ఆందోళనలు
బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం భవిష్యత్తులో జిల్లాల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. అందుకోసం కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. బీసీ నేతలైన ఆర్ కృష్ణయ్య, జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు తదితరులను కలుపుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. బీసీల బతుకులతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్ సర్కారుకు ఉద్యమబలంతో వణుకు పుట్టిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా బీసీలంతా ఇంకా భిక్షం ఎత్తుకోవాలా? అని ఆవేదన వ్యక్తంచేశారు.