అసత్యపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌ను మలాజిగిరిలో కలుపలేదని ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని తలసాని ఫైర్ అయ్యారు. సనత్‌నగర్ పరిధిలోని ప్రకాశ్‌నగర్, మోండా డివిజన్లను మలాజిగిరి జోన్‌లోని బోయిన్పల్లి సరిల్లో కలిపిన మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
– సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) పాలనా విభాగాలే కాకుండా.. బేగంపేట, మహంకాళి, గోపాలపురం, కార్ఖానా, బోయిన్ పల్లి వంటి కీలక పోలీస్ స్టేషన్లను మలాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి మార్చడం సికింద్రాబాద్ ప్రాధాన్యతను తగ్గించడమేనని తలసాని మండిపడ్డారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్ల చివరకు పోలీసు అధికారులు కూడా తమ పరిధి ఏదో తెలియక అయోమయానికి గురవుతున్నారని తలసాని విమర్శించారు. ఈనెల 17న నిర్వహించనున్న శాంతి ర్యాలీ అనుమతి కోసం ‘లషర్ జిల్లా సాధన సమితి’ దరఖాస్తు చేస్తే.. పది రోజులుగా హైదరాబాద్, మలాజిగిరి కమిషనరేట్ల మధ్య ఫైళ్లు అటు-ఇటు తిరుగుతున్నాయని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుందో కూడా చెప్పలేని స్థితిలో యంత్రాంగం ఉందని ఎద్దేవా చేశారు.
220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు లేకుండా చేయాలని చూస్తే సహించేది లేదని తలసాని హెచ్చరించారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాకపోతే ఈ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఆత్మగౌరవం కాపాడుకునేందుకు ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిర్వహించే శాంతి ర్యాలీలో ప్రజలు, మేధావులు, అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న మేరు సంఘం, ఆటో యూనియన్, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో లషర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు సామల హేమ, శైలజ, ప్రసన్న, సునీత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.